Rahul Gandhi attacks BJP: హర్యానా ప్రజలు ‘డంకీ’లుగా ఎందుకు మారుతున్నారు? .. బీజేపీపై రాహుల్ విమర్శలు

by Shamantha N |
Rahul Gandhi attacks BJP: హర్యానా ప్రజలు ‘డంకీ’లుగా ఎందుకు మారుతున్నారు? .. బీజేపీపై రాహుల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ బీజేపీపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. ఉద్యోగ కల్పన గురించి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశం, హర్యానాలోని యువతకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. బీజేపీ సర్కారు ఉద్యోగాలు కల్పించట్లేదని మండిపడ్డారు. హర్యానాలోని ఎక్కువమంది యువత ‘డంకీ’లుగా మారుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వీడియోను షేర్‌ చేస్తూ ‘హర్యానా ప్రజలు ‘డంకీ’లుగా ఎందుకు మారుతున్నారు?’ అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల వేరేదారిలేక వారు పనికోసం విదేశాలకు వెళ్తున్నారని ఆరోపించారు. అక్కడ సరైన తిండి, చోటు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలా మంది చిత్రహింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో తమ సమస్యలు చెప్పుకొని బాధ పడ్డారని తెలిపారు. హర్యానా నుంచి విదేశాలకు వెళ్లిన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పేర్కొంటూ వారు మాట్లాడిన వీడియోను రాహుల్ గాంధీ షేర్‌ చేశారు. వీడియోలో కొందరు యువత మాట్లాడుతూ తమ సొంత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండటం వల్ల తాము ఉపాధి కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చిందని.. అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఆ వీడియోనే ఎక్స్ లో పోస్టు చేశారు

బీజేపీపై విమర్శలు

బీజేపీ చేస్తున్న తప్పులకు యువత శిక్ష అనుభవిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని అన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయిందన్నారు. హర్యానాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. యువత తమ కుటుంబాలకు దూరంగా ఉండే పరిస్థితి రాకుండా ఉండటమే తమ లక్ష్యమని అన్నారు. ఇకపోతే, అక్టోబరు 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, అధికార బీజేపీ నుంచి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రైతుల సమస్యలు, నిరుద్యోగం పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తోంది. ఇకపోతే, ఉద్యోగావకాశాలు లేక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లేవారిని ‘డంకీ’లుగా పిలుస్తారు.

Next Story

Most Viewed