Airline Industry: దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా రెండు ఎయిర్‌లైన్స్

by S Gopi |
Airline Industry: దేశీయ విమానయాన రంగంలోకి కొత్తగా రెండు ఎయిర్‌లైన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన రంగంలో కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా కొత్త తరానికి చెందిన వ్యాపారవేత్తలు దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో కొత్త ఐడియాలతో సంస్థలను స్థాపిస్తున్నారు. తాజాగా రెండు ఎయిర్‌లైన్ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో శంఖ్ ఎయిర్ విమాన సేవలందించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందింది. దీని తర్వాత డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) నుంచి ఆమోదం అందుకోవాల్సి ఉంది. శర్వన్ కె విశ్వకర్మ ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ 2022 నుంచి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా నిర్మాణ సామగ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 2023 నుంచి ఎయిర్‌లైన్ పరిశ్రమలో పనులను మొదలుపెట్టింది. ముఖ్యంగా కంపెనీ బోయింగ్ 737-800ఎన్‌జీ విమానాల ద్వారా సేవలందించనుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీ ప్రధాన నగరాల మధ్య ఫ్లైట్‌లను నడపనుంది. తక్కువ సర్వీసులు ఉన్న మార్గాలపై దృష్టి సారించనున్నట్టు, రద్దీ మార్గాల్లోనూ అవసరమైన మేరకు ఎయిర్‌లైన్ సేవలందించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. శంఖ్ ఎయిర్‌తో పాటు కేరళ నుంచి మరో విమానయాన సంస్థ ఫ్లైట్‌లను నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా ఎయిర్‌లైన్ సంస్థను కలిగి ఉండాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అందులో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏటీఆర్-72 టర్బోప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా కేరళతో పాటు ఇతర నగరాల మధ్య సంస్థ సేవలు అందించాలని భావిస్తోంది. యూఏఈకి చెందిన అఫీ అహ్మద్, అయూబ్ కల్లాడ్ ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ 2025 నాటికి మూడు విమానాలతో కార్యకలాపాలను ప్రారంభించాలని భావిస్తోంది.

Next Story

Most Viewed