CPI(M): మార్క్సిస్టు పార్టీ నూతన సారధి ఎవరో..?

by Bhoopathi Nagaiah |
CPI(M): మార్క్సిస్టు పార్టీ నూతన సారధి ఎవరో..?
X

దిశ, వెబ్‌డెస్క్ : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో ఆయన స్థానంలో పార్టీ నూతన సారధి ఎవరన్న దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 1964లో సీపీఎం ఆవిర్భావం నుంచి పదవిలో ఉండగానే ప్రధాన కార్యదర్శి ఆకస్మికంగా మరణించడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ పదవి భర్తీకి ఏచూరి వంటి సమర్ధవంతమైన మరో నేత కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుతానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కోసం బెంగాల్ సీపీఎం కార్యదర్శి మహ్మద్ సలీం, కేరళ సీపీఎం కార్యదర్శి ఎంవి. గోవిందన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

సీపీఎంకు ఇప్పటిదాకా పుచ్చలపల్లి సుందరయ్య, ఈఎంవి. నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సుర్జీత్, ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరిలు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించారు. సీపీఎంలోని అత్యున్నత సెంట్రల్ కమిటీ సభ్యుల నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతికొద్ది జాతీయ రాజకీయ పార్టీల్లో ఒకటిగా సీపీఎం కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో సుధీర్ఘంగా 34 ఏళ్ల పాటు సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ పాలన ప్రపంచంలోనే అత్యధిక కాలం కొనసాగిన ప్రజాస్వామ్యబద్ధ కమ్యూనిస్టు ప్రభుత్వంగా రికార్డు సాధించింది. అనేక సార్లు పార్లమెంటులో మూడవ అతిపెద్ద పార్టీగా కూడా అవతరించింది.

ప్రస్తుతం సీపీఎం రెండు రాష్ట్రాలు కేరళలో ఎల్‌డీఎఫ్, తమిళనాడులో ఎస్‌పీఏ పాలక కూటములలో భాగస్వామిగా ఉంది. ఏడు రాష్ట్రాల శాసన సభలలో కూడా సీపీఎం ప్రాతినిధ్యం ఉంది. త్వరలో జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండటంతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో సీపీఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శి నియామకం త్వరగా జరుగాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఏచూరి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరా అని దేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed