స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ పీఏ బిభవ్‌పై ఆరోపణలు.. ఎవరాయన ?

by Shamantha N |
స్వాతి మలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ పీఏ బిభవ్‌పై ఆరోపణలు.. ఎవరాయన ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ పై దాడి జరిగింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి రెండుసార్లు పీసీఆర్ కాల్ చేసి సీఎం పీఏ బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉదయం 9.34 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు డీసీపీ మనోజ్ మీనా. దీంతో పోలీసులు సివిల్ లైన్స్ లోని సీఎం నివాసానికి చేరుకున్నారని వివరించారు. కానీ ఆమె అక్కడ కన్పించలేదన్నారు. కొద్దిసేపటికి స్టేషన్ కు వచ్చిన స్వాతి.. తర్వాత ఫిర్యాదు చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

భిభవ్ కుమార్ ఎవరంటే?

బిభవ్ కుమార్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచారు. ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆయన నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సీఎం వ్యక్తిగత కార్యదర్శి హోదా నుంచి దిల్లీ విజిలెన్స్ విభాగం కుమార్‌ను తొలగించారు. మరోవైపు ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు, ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారనే కేసుల్లో ఈడీ విచారణనను ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరిలో బిభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే ఎన్డీ గుప్తాకు సంబంధించిన 12 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టింది. గత నెలలో ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి బిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. కొన్ని పత్రాలకు సంబంధించి వివరణలు కోరేందుకు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం.

మరోవైపు, స్వాతి మలివాల్ కేజ్రీవాల్ అరెస్టుపై మౌనం వహించారు. ఆ టైంలో ఆమె భారత్ లో లేరు. కేజ్రీవాల్ జైళ్లో ఉన్నకాలంలో ఎలాంటి ప్రకటనలు కూడా చేయకపోవడం గమనార్హం.

Advertisement

Next Story