'రష్యా ప్రైవేట్ ఆర్మీకి కొత్త చీఫ్..?'.. ఆండ్రీ ట్రోషెవ్ పేరును పరిశీలిస్తున్న పుతిన్

by Vinod kumar |
రష్యా ప్రైవేట్ ఆర్మీకి కొత్త చీఫ్..?.. ఆండ్రీ ట్రోషెవ్ పేరును పరిశీలిస్తున్న పుతిన్
X

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ఆర్మీ “వాగ్నర్ గ్రూప్” జూన్ 23న ఆయనపైనే తిరగబడటాన్ని యావత్ ప్రపంచం కళ్లారా చూసింది. ఈ ఘటన పుతిన్‌కు కూడా కోలుకోలేని షాక్ ఇచ్చింది. పుతిన్‌పై తిరుగుబాటును లేవనెత్తిన ప్రైవేట్ ఆర్మీ చీఫ్ ప్రిగోజిన్ ఆచూకీ ప్రస్తుతానికి తెలియడం లేదు.. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆర్మీకి తన నమ్మకస్తుడిని చీఫ్‌గా నియమించేందుకు పుతిన్ రెడీ అవుతున్నారు. ఈ లిస్టులో ఒక వ్యక్తి పేరు ఉందని అంతటా చర్చ జరుగుతోంది. అతడే.. ఆండ్రీ ట్రోషెవ్ !! ట్రోషెవ్‌ను ‘సెడోయ్’ లేదా ‘గ్రే హెయిర్’ అని కూడా పిలుస్తారు. అతడు 1953 ఏప్రిల్‌లో మాజీ సోవియట్ యూనియన్‌లోని లెనిన్‌గ్రాడ్ (సెయింట్ పీటర్స్‌బర్గ్)లో జన్మించాడు. ట్రోషెవ్.. రష్యా ఆర్మీ రిటైర్డ్ కల్నల్. వాగ్నర్ గ్రూప్ వ్యవస్థాపక సభ్యులలో అతడు ఒకరు.

బషర్ అల్-అస్సాద్ నేతృత్వంలోని సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రష్యా ప్రైవేట్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్స్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా ట్రోషెవ్ వ్యవహరించాడు. ప్రస్తుతం రష్యా ప్రైవేట్ ఆర్మీ (వాగ్నర్ గ్రూప్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో అతడు ఉన్నాడు. వాగ్నెర్ గ్రూప్‌లోని అనేక ఉన్నత స్థాయి వ్యక్తులతో ట్రోషెవ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతడి పరిచయస్తుల లిస్టులో వాగ్నర్ గ్రూప్ స్థాపకుడు దిమిత్రి ఉట్కిన్, మాజీ GRU సైనిక గూఢచార అధికారి, కమాండర్లు అలెగ్జాండర్ సెర్జీవిచ్ కుజ్నెత్సోవ్, ఆండ్రీ బొగాటోవ్ కూడా ఉన్నారు. బ్రిటన్ దేశం ఆర్థిక ఆంక్షలు విధించిన వాగ్నర్ గ్రూప్ క్రూరమైన సైనిక కమాండర్ల లిస్టులో ట్రోషెవ్ ఉండటం గమనార్హం. ఇంత ట్రాక్ రికార్డు ఉండబట్టే.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ పదవిని ఆండ్రీ ట్రోషెవ్‌‌కు అప్పగించేందుకు పుతిన్ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed