CJI: సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ చివరి తీర్పు ఏంటంటే?

by Shamantha N |
CJI: సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ చివరి తీర్పు ఏంటంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. కాగా.. ఆయన చివరి తీర్పులో ‘బుల్డోజర్’ చర్యల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్‌ న్యాయం(Bulldozer justice) పేరుతో పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిపైనే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(justice Chandrachud) స్పందించారు. బుల్డోజర్ చర్యల ద్వారా పౌరుల గొంతు నొక్కడం సరైనది కాదని చెప్పుకొచ్చారు. చట్టబద్ధమైన పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్‌ న్యాయం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని.. వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు ఉండదని పేర్కొన్నారు. వీటికి అనుమతిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే.. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఇలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పులేదని.. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇందుకు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని సూచించారు.

బుల్డోజర్ న్యాయం

బుల్డోజర్‌ న్యాయం పేరుతో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రక్రియ స్టార్ట్ కాగా.. అది ఇతర రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే పలు మార్లు సుప్రీం కోర్టు(Supreme Court) తప్పుబట్టింది. నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేసింది. ఇకపోతే, 2022 నవంబర్‌లో భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud) పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన ఎన్నో ముఖ్యమైన కేసుల్లో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 11న ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా 2025 మే 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.

Advertisement

Next Story

Most Viewed