భారత్‌లో ఎన్నికలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్

by samatah |
భారత్‌లో ఎన్నికలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలను జర్మనీ ఎంతో ఆసక్తితో గమనిస్తోందని భారత్‌లోని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంతర్జాతీయ వేదికలపై ఎక్కువ మంది భారతీయులే కనిపిస్తారని కొనియాడారు. ఢిల్లీలోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో మల్టీపోలార్ వరల్డ్‌లో భారతదేశం-యూరోప్ భాగస్వామ్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారత్ జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం పట్ల జర్మనీ ఎంతో సంతోషించిందని ప్రశంసించారు. ప్రపంచదేశాలన్నీ భారత్‌కు చేరువవుతున్నాయని తెలిపారు. ‘ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ ప్రతికూల పరిస్థితులన్నింటినీ తట్టుకుని భారత్ మాత్రం ఎంతగా ఎదుగుతుందో చూస్తున్నాం. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను ప్రశంసలతో గమనించండి. ఇది ప్రజాస్వామ్య పండుగ’ అని వ్యాఖ్యానించారు.

‘జర్మనీ ప్రభుత్వంతో సహా అనేక దేశాలు భారతదేశానికి చేరువవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పెద్ద పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం’ అని తెలిపారు. గతంలో కంటే భారత్ అనేక విషయాల్లో ముందుందని చెప్పారు. యూఎన్ఎస్సీ లేదా ఇతర వేదికలపైన భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తుందని నొక్కి చెప్పారు. భారత్ వేదికగా జరిగిన జీ20సమావేశాల్లో జరిగిన చర్చలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుందని కొనియాడారు. జర్మనీతో సహా యూరప్‌తో బలమైన, దృఢమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed