బీజేపీకి ఓటేయ్యండి.. మమతా బెనర్జీ గూండాలను తలకిందులుగా వేలాడదీస్తాం

by Dishanational1 |
బీజేపీకి ఓటేయ్యండి.. మమతా బెనర్జీ గూండాలను తలకిందులుగా వేలాడదీస్తాం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఏఏ మొదలుకొని సందేశ్‌ఖాలీ అంశం వరకు అన్నింటిపై దీదీ పార్టీని, ప్రభుత్వాన్ని అమిత్ షా విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ముట్టుకునే దమ్ము కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి లేదని, కొత్త చట్టం ప్రకారం హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని షా హామీ ఇచ్చారు. రాయ్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి కార్తీక్ పాల్‌కు మద్దతుగా బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కరండిఘి వద్ద జరిగిన ర్యాలీలో మాట్లాడిన షా..సరిహద్దు రాష్ట్రంలోకి చొరబాట్లను బెంగాల్ ముఖ్యమంత్రి ఆపలేరు. మోడీ మాత్రమే చొరబాట్లను ఆపగలరు. గతంలో బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. మోడీ రామమందిరాన్ని ఇచ్చారు. ఈసారు 35 సీట్లిస్తే చొరబాట్లను ఆపగలమని తెలిపారు. ఇదే సందర్భంలో ఈ ఎన్నికల సీజన్‌కు బెంగాల్‌లో అతిపెద్ద చర్చకు దారితీసిన సందేశ్‌ఖాలీ అంశాన్ని ప్రస్తావించిన షా.. సందేశ్‌ఖాలీలో మమతా బెనర్జీ తన ఓటుబ్యాంకుపై ప్రభావం చూపకుండా మహిళలను హింసించేందుకు అవకాశం కల్పించారు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతోనే నిందితులు జైల్లో ఉన్నారన్నారు. అక్రమాల కారణంగా సుమారు 25,000 ప్రభుత్వ పాఠశాల సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి మాట్లాడుతూ.. ఒక్కో పనికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు చెల్లించారు. మాజీ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ నుంచి రూ. 51 కోట్ల రికవరీ జరిగినట్టు షా వెల్లడించారు.

మా, మాటి, మనుష్(మహిళ, నేల, మనిషి) నినాదంతో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. సందేశ్‌ఖాలీలో మహిళలను చిత్రహింసలకు గురిచేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు చోటిచ్చారు. అవినీతి కారణంగా మనిషులు బాధపడుతున్నారు. దీన్ని నిర్మూలించేందుకు బీజేపీకి ఓటు వేస్తే మమతా బెనర్జీ గూండాలను తలకిందులుగా వేలాడదీస్తాం, వారిని సక్రమ మార్గంలో ఉంచుతామని షా హామీ ఇచ్చారు. అధికార తృణమూల్ అవినీతికి వారి నేతల ఇల్లే సాక్ష్యం. ఒకప్పుడు గడ్డితో కప్పిన ఇళ్లలో ఉండేవారు, ఈరోజులు నాలుగంతుస్తుల మేడలో ఉంటున్నారు. కార్లలో తిరుగుతున్నారు. ఇదంతా ప్రజల డబ్బేనని షా ఆరోపణలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రాయ్‌గంజ్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తారని షా పేర్కొన్నారు.



Next Story

Most Viewed