Vinesh Phogat: దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: వినేశ్ ఫోగట్

by vinod kumar |
Vinesh Phogat: దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: వినేశ్ ఫోగట్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి నెలకొందని రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ (Vinesh Phogat) అన్నారు. ఖనౌరీ సరిహద్దు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్‌ (Jagjit Singh Dallewal)ను ఆదివారం కలిసి రైతుల నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్న ప్రధాని మోడీ (Pm modi) రైతుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రధాని ముందుకు రావాలని ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. రైతు నాయకుడు దల్వాల్ తన ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ఉద్యమానికి దేశ వ్యాప్త మద్దతు అవసరమని ఈ నిరసనల్లో పంజాబ్ (Panjab), హర్యానా (Haryana) సహా యావత్ దేశ ప్రజలంతా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. రైతు ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాలని తెలిపారు. రైతులను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపైనా వినేష్ స్పందించారు. ‘101 మంది రైతులను దేశ రాజధానికి వెళ్లనీయకుండా చిత్రహింసలకు గురిచేశారు. వారిపై బాష్పవాయువు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది పిరికిపంద చర్య’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని, రైతుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఫైర్ అయ్యారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

Advertisement

Next Story