Haryana assembly election: కాంగ్రెస్ లో చేరనున్న స్టార్ రెజ్లర్లు..?

by Shamantha N |
Haryana assembly election: కాంగ్రెస్ లో చేరనున్న స్టార్ రెజ్లర్లు..?
X

దిశ, నేషనల్ బ్యూరో: స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో వారు భేటీ అయ్యారు. అయితే, రాహుల్ తో వినేశ్ సమావేశమవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చినట్లయ్యింది. ఆ ఫొటోను కాంగ్రెస్‌ (Congress) పార్టీ సోషల్ మీడియా ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసింది. అయితే, వీరిద్దరూ రాహుల్‌ను ఎందుకు కలిశారన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదు. అయితే, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలో దిగుతారనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఫొగాట్‌, పునియా పోటీ ఖాయమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఊహాగానాలు

వినేశ్‌ ఫొగాట్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల ఒలింపిక్స్ ముగించుకుని దేశానికి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఆమెకు స్వాగతం పలికారు. అంతకుముందు అధికబరువు కారణంగా ఒలింపిక్స్ లో అనర్హతకు గురైనప్పుడు ఆమెను రాజ్యసభకు పంపాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఆగస్టు 31న శంభు సరిహద్దు వద్ద అన్నదాతలతో వినేశ్ ఫొగాట్ భేటీ అయ్యారు. హర్యానా నుంచి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. వినేశ్ దానిపై స్పందించారు. “నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను నా కుటుంబ సభ్యులను (రైతులను) కలవడానికి వచ్చాను. ఇప్పుడు రాజకీయాల గురించి అడిగితే, వారి పోరాటం వృథా అవుతుంది” అని చెప్పుకొచ్చారు. ఆప్ తో పొత్తు, నేడో రేడో అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వనుంది. ఇలాంటి టైంలో పునియా-వినేశ్‌-రాహుల్‌ భేటీ జరగడం గమనార్హం. వినేశ్ ను అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని కాంగ్రెస్‌ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, పునియాకు కూడా టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు, హర్యానా ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఇకపోతే, అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed