Uniform Civil Code : అక్టోబరు నుంచి యూసీసీ అమల్లోకి ?

by Hajipasha |
Uniform Civil Code : అక్టోబరు నుంచి యూసీసీ అమల్లోకి ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది అక్టోబరుకల్లా యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ను అమల్లోకి తెచ్చేందుకు ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై సోమవారం డెహ్రాడూన్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా యూసీసీ అమలుకు సంబంధించిన విధి విధానాలు, కార్యాచరణ ప్రణాళికపై ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయి కమిటీ నిపుణులతో సీఎం ధామి సమీక్షించారు. నిర్ణీత కాల వ్యవధిని లక్ష్యంగా పెట్టుకొని.. అప్పటిలోగా యూసీసీ నియమాలు, విధి విధానాలను ఖరారు చేయాలని నిపుణుల బృందానికి సీఎం దిశానిర్దేశం చేశారు. యూసీసీ అమల్లోకి వచ్చేలోగా వివిధ శాఖలు ఏవిధంగా ఉద్యోగులను సమాయత్తం చేయాలి ? ఎలాంటి శిక్షణ ఇవ్వాలి ? ప్రతీశాఖ.. దానికి అనుబంధంగా ఉండే ఇతర శాఖలతో ఎలా సమన్వయం సాధించాలి ? అనే దానిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగాలని ఉన్నతాధికారులకు సీఎం ధామి పిలుపునిచ్చారు.

మూడు సబ్ కమిటీలపై క్లారిటీ..

‘‘యూసీసీ రూల్స్ రూపకల్పనకు గతంలో 3 సబ్ కమిటీలు ఏర్పాటు చేశాం. మొదటి కమిటీ నిబంధనల రూపకల్పనపై ఫోకస్ పెట్టింది. అది ఇప్పటిదాకా 43 సమావేశాలు నిర్వహించింది. ఆ కమిటీ తన నివేదికను ఆగస్టు 31లోగా సమర్పిస్తుంది. మరో సబ్ కమిటీ పారదర్శకత, నిబంధనల అమలు అనే అంశంపై కసరత్తు చేస్తోంది. అది కూడా ఆగస్టు 31నే నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. యూసీసీకి సంబంధించిన కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ అవసరాలపై అధ్యయనానికి మరో సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇది సెప్టెంబరులో నివేదికను ఇస్తుంది’’ అని సీఎం ధామి వెల్లడించారు. సమావేశంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి, డీజీపీ అభినవ్‌కుమార్‌, యూసీసీని అమలుచేసే ప్యానెల్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో యూసీసీపై చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టానికి ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర లభించింది. ఆ వెంటనే యూసీసీ అమలు కోసం నిబంధనలను రూపొందించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి శతృఘ్న సింగ్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed