PM Modi: భారత్ రానున్న 297 పురాతన వస్తువులు.. అమెరికాలో మోడీ కీలక ఒప్పందం

by Shamantha N |
PM Modi: భారత్ రానున్న 297 పురాతన వస్తువులు.. అమెరికాలో మోడీ కీలక ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా మరో కీలక ఒప్పందం కుదిరింది. అక్రమ రవాణా సహా పలు మార్గాల్లో అమెరికాకు చేరిన పురాతన వస్తువులు దేశానికి చేరనున్నాయి. క్వాడ్ సదస్సుకోసం అమెరికాకు వెళ్లి మోడీ పురాతన వస్తువులకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. భారత్‌కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు భారత్‌- అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. పురాతన వస్తువులు తిరిగి అప్పగిస్తున్నందుకు అమెరికాకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల సాంస్కృతి వస్తువుల అక్రమ రవాణా నిరోధించడాన్ని బలపరుస్తుందని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. దీంతో, 2016 నుండి అమెరికా నుంచి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల సంఖ్య 578కి చేరుకుంది. ఇకపోతే, విదేశాల నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో ఇదే గరిష్ఠం. ఈ నేపథ్యంలో 2004- 2013 మధ్య కాలంలో భారత్‌కు కేవలం ఒక్కటంటే ఒక్క వస్తువు మాత్రమే వెనక్కి వచ్చింది. కాగా.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పురాతన వస్తువులు వెనక్కి రప్పించేందుకు తీవ్రంగా కృషి చేసింది. ఈ క్రమంలోనే 2021లో మోడీ అమెరికా పర్యటన అనంతరం 157 పురాతన వస్తువులు వెనక్కి రాగా.. 2023లో మరో 105 వస్తువులు తిరిగి వచ్చాయి

ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఒప్పందం

ఇదిలా ఉండగా.. ఈఏడాది జులైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా- భారత్‌ల మధ్య ఒప్పందం జరిగింది. భారత్‌ నుంచి యూఎస్‌కి కళాఖండాల అక్రమ రవాణాను నిరోధించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఒప్పందం జరిగింది. అమెరికా నుంచి భారత్ వస్తున్న పురాతన వస్తువులు దాదాపు 4000 సంవత్సరాల కాలానికి చెందినవని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. 2000 BCE - 1900 CE సమయంలోనివని వెల్లడించింది. అందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాఖండాలు ఉన్నాయంది. ఎక్కువభాగం తూర్పు భారతదేశానికి చెందిన టెర్రకోట కళాఖండాలని వెల్లడించంది.

Next Story