Terror: హిజ్బుత్ తహ్రీర్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన కేంద్రం.. ఆ సంస్థ లక్ష్యమేంటో తెలుసా?

by Mahesh Kanagandla |
Terror: హిజ్బుత్ తహ్రీర్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన కేంద్రం.. ఆ సంస్థ లక్ష్యమేంటో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుత్ తహ్రీర్‌ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదనే ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. హిజ్బుత్ తహ్రీర్ సంస్థ నిస్సహాయులైన, పేద యువతను వివిధ ఉగ్రవాద సంస్థల్లోకి రిక్రూట్ చేసుకుంటున్నదని అమిత్ షా తెలిపారు. ఉగ్రకార్యకలాపాల కోసం నిధులను సమకూర్చే, దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ముప్పుగా మారుతున్న ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్టు వివరించారు. దేశ భద్రతకు కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉగ్రసంస్థలను ఉక్కు పిడికిలితో అణచివేస్తుందని పేర్కొన్నారు. భారత వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తూ.. వేర్పాటువాద, ప్రభుత్వ వ్యతిరేకత ఆలోచనలను తెప్పిస్తుందని వివరించారు. తద్వార యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు.

హిజ్బుత్ లక్ష్యం ఏమిటీ?

ఇస్లామిక్ రాజ్యాన్ని, ఖలీఫా రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలనే లక్ష్యంతో హిజ్బుత్ తహ్రీర్ సంస్థ ఏర్పడింది. జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో స్థానిక ప్రజలను పావుగా వాడుకుంటుందని తెలిపారు. 1953లో జెరూసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ హెడ్ క్వార్టర్ లెబనాన్‌లో ఉన్నది. కానీ, యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి 30 దేశాల్లో ఈ సంస్థ పని చేస్తున్నది. ఈ సంస్థ కార్యకలాపాల దృష్ట్యా ఇప్పటికే జర్మనీ, ఈజీప్ట్, యూకే, మధ్యాసియాలోని అరబ్ దేశాలు హిజ్బుత్ పై నిషేధాన్ని విధించాయి.

Advertisement

Next Story

Most Viewed