అమిత్ షా సెక్యూరిటీ టీమ్‌లో చేరిన అగంతకుడు!

by GSrikanth |
అమిత్ షా సెక్యూరిటీ టీమ్‌లో చేరిన అగంతకుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం కలవరపాటుకు గురి చేసింది. హోం మంత్రిత్వ శాఖ అధికారినని చెప్పుకుంటూ అమిత్ షా వెంట తిరిగిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారి ముంబైలో అమిత్ షా పర్యటించారు. మంగళవారం ఆయన పర్యటన ముగిసింది. అయితే, ఈ పర్యటనలో ఓ వ్యక్తి హోంశాఖ ఐడీ కార్డుతో సెక్యూరిటీ టీమ్‌లో ప్రత్యక్షమయ్యాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వెంటనే అమిత్ షా భద్రతా టీమ్ అతడి పేరు హేమంత్ పవార్‌గా గుర్తించి ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే, భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని తేలడంతో అతడిని అరెస్టు చేసి ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నకిలీ ఐడీ కార్డుతో గంటల తరబడి అమిత్ షా చుట్టూ తిరిగాడని, అలాగే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిగా అతడు కనిపించాడని పోలీసులు వివరించారు. అమిత్ షా హాజరైన రెండు కార్యక్రమాలలో సదరు వ్యక్తి ఉన్నాడని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్ల వెలుపల కూడా కనిపించాడని పోలీసులు స్పష్టం చేశారు. సదరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకుంటున్నాడని అయితే, ఆ ఎంపీ ఏ పార్టీకి చెందిన వాడనేది పోలీసులు స్పష్టం చేయలేదు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో తిరుగుబాటు తర్వాత అక్కడ ఏక్ నాథ్ షిండే వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా పర్యటనలో భద్రతా పరమైన లోపం వెలుగు చూడటం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతను ఎవరు? ఎందుకు అమిత్ షా చుట్టూ గంటల తరబడి తిరిగాడు అనేది ఉత్కంఠ రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed