World Meditation Day: డిసెంబర్ 21న ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’

by Shamantha N |
World Meditation Day: డిసెంబర్ 21న ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించేందుకు భారత్ సహా పలు దేశాలు తీర్మనాన్ని తీసుకొచ్చాయి. దీనికి ఐక్యరాజ్యసమితి (United Nations) జనరల్‌ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. డిసెంబరు 21వ తేదీని ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం (World Meditation Day)’గా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలోని భారత (India) శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ‘‘సమగ్ర శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు..! ఏటా డిసెంబరు 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని (World Meditation Day) నిర్వహించుకునేందుకు భారత్‌ సహా ఇతర దేశాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని యూఎన్ ఆమోదించింది. వసుదైక కుటుంబం అనే సూత్రాన్ని భారత్ విశ్వసిస్తుంది. ప్రపంచశ్రేయస్సు కోసం పాటుపడుతోంది. డిసెంబరు 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. భారత సంప్రదాయం ప్రకారం శీతాకాల అయనాంతం అంటే ఉత్తరాయనంలో అడుగుపెట్టే రోజు ఇది. ఆరోజుని అందరూ పవిత్రమైన రోజుగా భావిస్తారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

కో స్పాన్సర్లుగా..

ధ్యాన దినోత్సవ నిర్వహణ కోసం లిచిటెన్‌స్టీన్‌ తీర్మానం తీసుకురాగా.. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌, మెక్సికో, ఆండోరా, బంగ్లాదేశ్‌, లగ్జెంబర్గ్‌, పోర్చుగల్‌, బల్గేరియా వంటి దేశాలు కో-స్పాన్సరర్‌గా ఉన్నాయి. 193 మంది సభ్యులున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ శుక్రవారం సమావేశమై ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. పదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితిలో యోగాపై భారత్ చేసిన ప్రతిపాదనను కూడా హరీశ్ గుర్తుచేసుకున్నారు. వేసవి అయనాంతం అంటే దక్షిణాయంలోకి ప్రవేశించేరోజు జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని చేసిన ప్రతిపాదనకు 2014లో ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపిందన్నారు. గత దశాబ్దకాలంలో ఇది ఉద్యమంగా మారిందన్నారు.

Next Story