15 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టించిన బంగారు పన్ను

by Javid Pasha |   ( Updated:2023-02-11 17:29:00.0  )
15 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టించిన బంగారు పన్ను
X

దిశ, వెబ్ డెస్క్: ఓనర్ కు ఎగనామం పెట్టి డబ్బుతో పారిపోయిన ఓ వ్యక్తిని 15 ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 15 ఏళ్లపాటు పోలీసులకు చిక్కకుండా మారువేశంలో తిరుగుతోన్న సదరు వ్యక్తిని అతడి బంగారు పన్ను పట్టించడం కొసమెరుపు. ఇక వివరాల్లోకి వెళ్తే..

ప్రవీణ్ ఆశుభా జడేజా (38) అనే వ్యక్తి ముంబైలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ మేన్ గా పని చేసేవాడు. అయితే ఒకరోజు ఆ దుకాణం ఓనర్ ప్రవీణ్ జడేజాకు రూ.40 వేలిచ్చి తన మిత్రుడైన తోటి వ్యాపారికి ఇవ్వమని పంపాడు. ఓనర్ ఇచ్చిన డబ్బుతో వెళ్లిన ప్రవీణ్ కొంత సమయం తర్వాత తిరిగొచ్చి తాను టాయిలెట్ కు వెళ్లింది చూసి ఎవరో తన వద్ద నుంచి డబ్బు కొట్టేశారని ఓనర్ తో చెప్పాడు. అది నమ్మిన ఓనర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ప్రవీణ్ మీద అనుమానం వచ్చిన పోలీసులు తమదై శైలిలో విచారించారు. దీంతో ఆ డబ్బును తానే వాడుకున్నట్లు ప్రవీణ్ చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన ఓనర్ ఆ సేల్స్ మేన్ పై కేసు పెట్టాడు. ఈ క్రమంలోనే కోర్టుకు హాజరైన ప్రవీణ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిని 'పరారీలో ఉన్న వ్యక్తి' కింద పరిగణించి నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడి కోసం గాలించసాగారు. కానీ గత 15 ఏళ్లుగా సదరు నిందితుడు ప్రవీణ్ మారువేశంలో తప్పించుకు తిరగసాగాడు.

దొంగను పట్టించిన బంగారు పన్ను

అయితే నిందితుడు ప్రవీణ్ జడేజా కు రెండు బంగారు పన్నులు (దంతాలు) ఉండేవి. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రవీణ్ గుజరాత్ కు వెళ్లి అక్కడే నివాసముంటున్నాడు. అక్కడ ప్రవీణ్ సింగ్, ప్రదీప్ సింగ్ ఆశుభా జడేజా వంటి పేర్లతో చలామణి అవుతున్నాడు. తన పేరు మార్చుకున్న ప్రవీణ్ ఆశుభా జడేజా.. తన రెండు బంగారు పన్నులు మాత్రం మార్చుకోవడం మరిచాడు. అయితే ఇటీవలే ఈ కేసును పునర్విచారణకు చేపట్టిన పోలీసులు.. ప్రవీణ్ సన్నిహితులను విచారించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ గుజరాత్ రాష్ట్రం కచ్చ్ లోని జిల్లా సభ్రాయి గ్రామంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అతడికి కాల్ చేసి తమను తాము ఎల్ఐసీ ఏజెంట్లుగా పరిచయం చేసుకున్న పోలీసులు.. ప్రవీణ్ ను ముంబైకి రావాలని కోరారు. అయితే అక్కడికి వచ్చాక బంగారు పన్ను ఆధారంగా సదరు వ్యక్తిని ప్రవీణ్ ఆశుభా జడేజాగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడిపై దొంగతనం, చీటింగ్ కేసు పెట్టి జైలుకు పంపారు. మొత్తానికి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని బాగానే మేనేజ్ చేసిన నిందితుడు చివరికి తన బంగారు పన్ను వల్ల పట్టుబడటంతో ఖిన్నుడైపోయాడు.

Advertisement

Next Story

Most Viewed