ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్: బీజేపీ నేత దేవరాజెగౌడ అరెస్టు

by samatah |
ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్: బీజేపీ నేత దేవరాజెగౌడ అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ అరాచకాలపై తొలిసారి హెచ్చరించిన బీజేపీ నేత దేవరాజె గౌడను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు పోలీసులు గులిహాల్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. తన ఆస్తిని అమ్మేందుకు సహాయం చేస్తాననే నెపంతో తనను వేధించాడని ఓ 36ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు దేవరాజె గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏప్రిల్ 1నే కేసు నమోదైనా తాజాగా వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు. దేవరాజ్ తమ ఇంట్లోకి చొరబడ్డాడని, తనను బెదిరించాడని, అతనితో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ భర్త కూడా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

అయితే ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ షేర్ చేశారని దేవరాజె గౌడపై ఆరోపణలు ఉన్నాయి. అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌లు అందరికి పంచిపెట్టారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ఈ కథనాలను దేవరాజె గౌడ కొట్టిపారేశారు. పెన్ డ్రైవ్‌ల పంపిణీలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. కానీ అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. దీంతో చిత్రదుర్గ పోలీసులు దేవరాజె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అరెస్టు చేశారు.

కాగా, గతేడాది డిసెంబర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు దేవరాజెగౌడ లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి పలు వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ఉందని, ఫుటేజీలో కనిపించిన వారిలో కొందరు ప్రభుత్వ అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. లైంగిక కార్యకలాపాలకు పాల్పడేలా మహిళలను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ వీడియోలు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ పెన్ డ్రైవ్ కాంగ్రెస్ నేతలకు చేరిందని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి హసన్ లోక్‌సభ స్థానం నుంచి ప్రజ్వల్‌ను జేడీఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే.. ప్రతిపక్షాలు ఈ వీడియోలను ఉపయోగించుకుంటాయని వెల్లడించారు. కానీ బీజేపీ అధిష్టానం వీటిని పట్టించుకోక పోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed