యూపీలో తీవ్ర విషాదం..116 మంది మృతి

by vinod kumar |
యూపీలో తీవ్ర విషాదం..116 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మతపరమైన కార్యక్రమం అనంతరం జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హత్రాస్ జిల్లా సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో మంగళవారం మత బోధకుడు భోలే బాబా ప్రార్థనా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. అయితే ప్రోగ్రాం ముగిసిన అనంతరం ప్రజలు వేదికపై నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా తొక్కిసలాట జరడగంతో 116 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అలాగే ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ ఈ ఘటనను ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఎటా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తొక్కిసలాటకు గల స్పష్టమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగీ ఆధిత్యనాధ్ స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పలువురు మంత్రులను ఘటనా స్థలానికి పంపించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై ఆగ్రాలోని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలీగఢ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రపతి, ప్రధాని దిబ్భ్రాంతి

ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు మరణించిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని మోడీ తెలిపారు. ‘యూపీలో హత్రాస్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా చాలా మంది మరణించిన వార్త హృదయ విదారకంగా ఉంది. వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి’ అని ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాతే కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి: అఖిలేష్ యాదవ్

హత్రాస్ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒక కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని తెలిసినప్పడు.. వారి భద్రతకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed