వీవీప్యాట్‌ల ఓటు స్లిప్స్‌ లెక్కింపు వ్యవహారంలో కీలక మలుపు

by Hajipasha |
వీవీప్యాట్‌ల ఓటు స్లిప్స్‌ లెక్కింపు వ్యవహారంలో కీలక మలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఓ కీలకమైన అంశంపై నోటీసులు జారీ చేసింది. ఓటర్ వేరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాల నుంచి జారీ అయ్యే అన్ని ఓటరు స్లిప్పులనూ కౌంట్ చేయాలని కోరుతూ అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర సర్కారు, కేంద్ర ఎన్నికల సంఘంలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను మే 17న విచారణకు లిస్ట్ చేసినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. గతంలో ఇదే అంశంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) దాఖలు చేసిన మరో అభ్యర్థనతో ఈ పిటిషన్‌ను ట్యాగ్ చేయాలని ఆదేశించింది. చివరిసారిగా 2019 ఏప్రిల్ 8న కూడా ఎన్నికల టైంలో వీవీ ప్యాట్‌ల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ర్యాండమ్‌గా ఒక్కో వీవీ ప్యాట్‌ను మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ చేసేవారు. అయితే అప్పట్లో దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఓటర్ స్లిప్పులను కౌంట్ చేసేందుకు ర్యాండమ్‌గా ఎంచుకునే వీవీ ప్యాట్‌ల సంఖ్యను ఐదుకు పెంచింది.

పిటిషన్‌లో ఏముంది?

వీవీ ప్యాట్ల వెరిఫికేషన్‌లో భాగంగా నిర్వహించే ఓటరు స్లిప్స్ లెక్కింపు ప్రక్రియను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 5 నుంచి 6 గంటల్లోనే పూర్తి చేయొచ్చని పిటిషనర్ అరుణ్ కుమార్ అగర్వాల్ వాదించారు. ‘‘24 లక్షల వీవీప్యాట్‌ల కొనుగోలుకు ప్రభుత్వం రూ.5000 కోట్లు వెచ్చించింది. అయితే కేవలం 20వేల వీవీపీఏటీ స్లిప్పులు మాత్రమే వేరిఫై అయ్యాయి. వీవీ ప్యాట్, ఈవీఎంలకు సంబంధించి నిపుణులు అనేక ప్రశ్నలు లేవ నెత్తుతున్నారు. గతంలో ఈవీఎం, వీవీప్యాట్ ఓట్ల లెక్కింపులో పెద్ద సంఖ్యలో తేడాలు వచ్చాయి. అందుకే వీవీప్యాట్ స్లిప్పులన్నింటినీ లెక్కించడం మంచిది. బ్యాలెట్ పేపర్‌లో వేసిన ఓటు కూడా లెక్కించబడిందో లేదో సరిగ్గా తనిఖీ చేయడానికి ఓటర్లను అనుమతించడం తప్పనిసరి’’ అని తన పిటిషన్‌లో అరుణ్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పిటిషనర్ అరుణ్ కుమార్ అగర్వాల్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్, న్యాయవాది నేహా రాఠీ వాదనలు వినిపించారు. కాగా, ఈసీ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

Next Story

Most Viewed