మోడీ నామినేషన్‌కు హాజరైన ప్రముఖులు వీరే?

by samatah |
మోడీ నామినేషన్‌కు హాజరైన ప్రముఖులు వీరే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్‌తో కలిసి వారణాసి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన మోడీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. పండిట్ గణేశ్వర్ శాస్త్రి, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా, సంజయ్ సోంకర్‌లు మోడీకి ప్రతిపాదకులుగా ఉన్నారు. నామినేషన్ పత్రాల దాఖలుకు ముందు మోడీ దశాశ్వమేధ ఘాట్‌, కాల భైరవ ఆలయంలో పూజలు చేశారు. కాగా, వారణాసి నుంచి మోడీ ఎంపీగా పోటీ చేయడం ఇది మూడో సారి. అంతకుముందు 2014, 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున యూపీ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

హాజరైన 12 రాష్ట్రాల సీఎంలు

మోడీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తో పాటు ఎన్డీయే మిత్ర పక్షాల నేతలు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​, ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామి, మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్‌తో పాటు 12రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అలాగే లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఎల్‌జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఎస్బీ ఎస్పీ అధ్యక్షులు ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం వీరందరితో మోడీ భేటీ అయ్యారు.

ప్రజల ఆశీర్వదాలే స్ఫూర్తిని నింపాయి: మోడీ

నామినేషన్ దాఖలుకు ముందు మోడీ ఎక్స్ వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ‘వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. గత పదేళ్లలో ప్రజల నుంచి లభించిన అద్భుతమైన ప్రేమ, ఆశీర్వాదాలు నిరంతర సేవా స్ఫూర్తిని నింపాయి. సంకల్పంతో పనిచేయడానికి నన్ను ప్రేరేపించాయి. మూడో సారి గెలిచి కూడా ప్రజల సంక్షేమానికి కొత్త శక్తితో పని చేస్తాను’ అని తెలిపారు. వారణాసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

అఫిడవిట్‌లో కీలక విషయాలు

మోడీ అఫిడవిట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లుగా ప్రకటించారు. రూ.52 వేల 920 నగదు ఉందని తెలిపారు. అలాగే తన బ్యాంకు అకౌంట్‌లో రూ. 80,304 ఉండగా, ఎస్‌బీఐలో రూ.2,85,60,338 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా కలిగి ఉన్నారు. రూ.2,67,750 విలువైన నాలుగు బంగారు ఉంగరాలతో పాటు పలు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. మోడీకి సొంత ఇల్లు, భూమి, కారు లేక పోవడం గమనార్హం. ఐదేళ్లలో మోడీ ఆస్తి రూ.87 లక్షలు పెరిగింది. 2014 ఎన్నికల్లో మోడీ తన మొత్తం ఆస్తులను రూ.1.65 కోట్లుగా ప్రకటించారు. 2019లో రూ.2.15 కోట్లుగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed