రేపే నాలుగో విడత సంగ్రామం: తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధం

by samatah |
రేపే నాలుగో విడత సంగ్రామం: తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల పోరులో భాగంగా నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్‌ 8, పశ్చిమ బెంగాల్‌లో 8, బిహార్‌లో5, ఆంధ్రప్రదేశ్‌ 25, తెలంగాణలోని 17, ఒడిశా 4 , జార్ఖండ్‌లో 4, జమ్మూ కశ్మీర్‌లోని ఒక స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఓటింగ్ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు ఈసీ పొడిగించింది.

మహిళా అభ్యర్థులు 10శాతమే

96 లోక్ సభ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉండగా..వారిలో వీరిలో 1,540 మంది పురుషులు, 170 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కేవలం 10శాతం మాత్రమే మహిళా అభ్యర్థులు ఉండటం గమనార్హం. మొత్తం 17.7కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 8.97 కోట్ల మంది పురుషులు, 8.73కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. దీని కోసం ఈసీ 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 19లక్షల మంది పోలింగ్ అధికారులను విధుల్లో మోహరించింది. వీరంతా ఆదివారమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్టు ఈసీ తెలిపింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. కాగా, 543 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు మూడు దశల్లో 20 రాష్ట్రాలు, యూటీల్లోని 284 స్థానాలకు పోలింగ్‌ పూర్తైంది.

పోటీలో ఐదుగురు కేంద్ర మంత్రులు

ఈ విడతలో ఐదుగురు కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కేంద్ర మంత్రుల్లో అజయ్ మిశ్రా యూపీలోని ఖేరీ నుంచి బరిలో నిలవగా..తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే బిహార్‌లోని బెగుసరాయ్‌ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌, ఉజియార్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, జార్ఖండ్‌లోని ఖుంటి లోక్‌సభ స్థానం నుంచి అర్జున్ ముండా పోటీ చేస్తున్నారు. ఇక, ప్రముఖ అభ్యర్థుల్లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత మహువా మొయిత్రా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, పీడీపీ నేత ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.

28 శాతం మంది అభ్యర్థులు కోటీశ్వరులే!

నాలుగో దశ ఎన్నికల్లో 1717 మంది అభ్యర్థుల్లో 476 (28శాతం) మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. వీరందరికి కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్టు తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.11.72 కోట్లు కాగా.. శివసేన, బిజూ జనతాదళ్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), టీడీపీ, బీఆర్ఎస్ అభ్యర్థులందరూ కోటీశ్వరులే కావడం గమనార్హం. ఇక 24 మంది అభ్యర్థులు తమకు ఆస్తులు ఏమీ లేవని ప్రకటించారు. అలాగే 274 మంది అభ్యర్థులపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది.

Advertisement

Next Story