జాబితా విడుదల: కాంగ్రెస్‌తో కలిసి నడిచే పార్టీలు ఇవే!

by GSrikanth |   ( Updated:2023-02-24 03:49:59.0  )
జాబితా విడుదల: కాంగ్రెస్‌తో కలిసి నడిచే పార్టీలు ఇవే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు స్పీడప్ చేసింది. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచే పార్టీలు ఏవి అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. పొత్తుల అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రొగ్రెసివ్ ఇండియా కోసం టీమ్ సిద్ధం అయిందని ఈ జట్టుకు కాంగ్రెస్ కెప్టెన్‌గా ఉంటుందని గురువారం అన్నారు. ఈ టీమ్‌లో ఉండబోయే పార్టీల జాబితాను సైతం ఆయన పేర్కొనడం ఆసక్తిని రేపుతోంది. మాణిక్కం ఠాగూర్ ట్వీట్ ప్రకారం కాంగ్రెస్ కూటమిలో డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్ఎస్‌యూ, జేఎంఎం, యూఎంఎల్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, వీసీకే, పీడీపీ, ఎన్ సీ, కేసీ, ఎంఎన్ఎం పార్టీలు ఉంటాయని పేర్కొన్నారు. మేమంతా పరస్పరం గౌరవించుకుంటూ ఆర్ఎస్ఎస్‌ను ఓడించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. అలాగే ప్రగతిశీల భారతదేశాన్ని కాంక్షించే కొత్త స్నేహితులను సైతం స్వాగతిస్తామన్నారు.

ఈ సందర్భంగా టీఎంసీ పేరును జాబితాలో పేర్కొనకపోవడంపై ఓ నెటిజన్ల ప్రశ్నించారు. ఇది ముఖ్యమైన పార్టీ అని పేర్కొనగా ఆ పార్టీని ఈడీ ఆపరేట్ చేస్తోందని మాణిక్కం బదులిచ్చారు. లిస్ట్‌లో కమ్యూనిస్టు పార్టీలతో పాటు మరికొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు లేకపోవడంపై నెటిజన్లు భిన్నరీతుల్లో రియాక్ట్ అవుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ చేస్తున్న విపక్షాల ఐక్యత ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.



Advertisement

Next Story

Most Viewed