నేటి నుంచి ‘మహాజన్ సంపర్క్ అభియాన్’

by Javid Pasha |
నేటి నుంచి ‘మహాజన్ సంపర్క్ అభియాన్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేండ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ విజయాలను ప్రలజకు వివరించేందుకు బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అందులో భాగంగా మంగళవారం నుంచి జూన్ 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ అభియాన్ కింద అన్ని జిల్లాలు, మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్ లు, అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 51 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుంది. అంతేకాకుండా లోక్ సభ స్థాయిలో మొత్తం 396 సభలు నిర్వహించాలని డిసైడైంది.

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 51 భారీ బహిరంగ సభల్లో రెండు సభలు తెలంగాణలోనే ఉండనున్నాయి. జన్ సంపర్క్ అభియాన్ సన్నాహకాల కోసం ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలను బీజేపీ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం దేశ వ్యాప్తంగా 117 క్లస్టర్ బృందాలను నియమించింది. రాష్ట్రంలో ఏడుగురు సభ్యులు, జిల్లా స్థాయిలో ఆరుగురు, మండల స్థాయిలో నలుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటుచేయాలని హైకమాండ్ ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది. తొమ్మిదేండ్ల మోడీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజలకు వివరించి బీజేపీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ రూపొందించుకుంది.

Advertisement

Next Story

Most Viewed