ఆ ఊరు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీ: ఇళ్లు 71..కానీ ఆఫీసర్లు మాత్రం 51

by samatah |
ఆ ఊరు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీ: ఇళ్లు 71..కానీ ఆఫీసర్లు మాత్రం 51
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) సాధించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఎందుకంటే ఇవి దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రభుత్వోద్యోగాలు. అందుకోసం ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఎంతో కాలంగా పట్టుదలతో శ్రమిస్తుంటారు. అనేక ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీనిలో కొంత మంది విజయం సాధిస్తే, మరి కొంత మంది ఉద్యోగం సాధించకుండానే ఉండిపోతారు. ఈ పరీక్ష అత్యంత కఠినమైనదిగా కూడా అభ్యర్థులు చెబుతుంటారు. కానీ.. ఓ గ్రామంలో మాత్రం అత్యంత సులువుగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సక్సెస్ అవుతున్నారు. 75 కుటుంబాలు ఉంటే ఆ ఊరిలో ఇప్పటి వరకు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ప్రస్తుతం ఆ ఊరు దేశంలోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మాదోపట్టికే సాధ్యం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్ జిల్లాలోని మాదోపట్టి అనే మారుమూల గ్రామమే సివిల్స్ ఉద్యోగాలకు కంచుకోటగా మారింది. ఐఏఎస్‌లకు ఫ్యాక్టరీగా భావిస్తున్న ఈ ఊరిలో 75 ఇళ్లు ఉండగా..ఇప్పటి వరకు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. దీంతో దేశంలోనే అత్యధిక మంది సివిల్ సర్వెంట్లను అందించిన గ్రామంగా మాదోపట్టి ఘనత సాధించింది. వీరంగా ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం, రాష్ట్రంలోని సీఎంఓ ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక అనేక మంది ఇస్రో, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో విధుల్లో ఉన్నారు. అలాగే ఒకే ఇంట్లో వినయ్ కుమార్ సింగ్, చత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అనే నలుగురు సోదరులు సైతం ఐఏఎస్‌లుగా ఎంపికవ్వడం గమనార్హం. మొదటి సారిగా ఈ గ్రామానికి చెందిన ముస్తఫా హుస్సేన్ అనే వ్యక్తి 1914లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇక ఈ గ్రామం వెనుదిరిగి చూడలేదు. ప్రతి ఏటా సివిల్స్‌కు ఎంపికవుతూనే ఉన్నారు. అయితే హుస్సేన్ ప్రేరణతోనే అనేక మంది సివిల్స్‌ వైపు మొగ్గు చూపారని గ్రామస్తులు చెబుతుంటారు.

మహిళలు సైతం ఎంపిక

ఊరిలోని మగవాళ్లే కాకుండా..మహిళలు సైతం సివిల్ సర్వీస్ అధికారిణులుగా ఎంపికయ్యారు.1980లో ఆశా సింగ్ అనే మహిళ ఐఏఎస్‌కు ఎంపికవ్వగా.. ఆ తర్వాత 1982లో ఉషా సింగ్, 19983లో ఇందుసింగ్, 1994లో సరితా సింగ్ అనే మహిళలు ఉన్నత సర్వీసులకు సెలక్టయ్యారు. అనేక మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటంతో పండగలు వచ్చినప్పుడు వారంతా తప్పకుండా మాదోపట్టికి వస్తుంటారు. దీంతో గ్రామంలో వాహనాల రద్దీ ఉంటుంది. ఎర్ర బుగ్గ ఉన్న కార్ల సైరన్ తో సందడి నెలకొంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. అయితే ఇంత ఘనత సాధించిన ఈ ఊరిలో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. గ్రామ దరిదాపుల్లోనూ కోచింగ్ సెంటర్లు, పేరుగాంచిన విద్యాసంస్థలు ఏం ఉండవు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తారని.. కానీ విద్యార్థులపై తమ తల్లి దండ్రులు శ్రద్ద చూపెడతారని పాఠశాల, కళాశాల స్థాయి నుంచే సివిల్స్‌కు ప్రిపేరయ్యేలా వారిని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. కాబట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ గ్రామం నుంచి ప్రేరణ పొందాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed