ఏడు సీట్లపై వీడని ఉత్కంఠ..మహాయుతి కూటమిలో ఆందోళన!

by Dishanational2 |
ఏడు సీట్లపై వీడని ఉత్కంఠ..మహాయుతి కూటమిలో ఆందోళన!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసినా మహారాష్ట్రలోని అధికార ‘మహాయుతి కూటమి’ మధ్య సీట్ల పంపకం కుదరలేదు. ఇంకా ఏడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో కూటమి నేతల్లో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని మహాయుతి కూటమిలో శివసేన, బీజేపీ, ఎన్సీపీ శరద్ చంద్రపవార్ పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. బీజేపీ 31 స్థానాల్లో, శివసేన 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ 4 స్థానాల్లో పోటీ చేస్తాయని కూటమి నేతలు గతంలో ప్రకటించినా.. ఏడు సీట్లపై మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. ఈ స్థానాల్లో దక్షిణ ముంబై, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, థానే, కళ్యాణ్, పాల్ఘర్, నాసిక్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సీటులో ఇరు వర్గాలు పట్టుబట్టడమే ఆలస్యానికి కారణమని సన్నిహితవర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా శివసేనకు కంచుకోటలుగా ఉన్న థానే, కళ్యాణ్, ఫాల్ఘర్, నాసిక్ స్థానాలపై బీజేపీ ఫోకస్ చేయడంతోనే జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. వీటిలో ఎలాగైనా తన అభ్యర్థులను నిలబెట్టాలని బీజేపీ భావిస్తుండగా..ఆ స్థానాలను వదులుకునేందుకు షిండే ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అంతేగాక సీట్ షేరింగ్ ఖరారు కాకముందే ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను రత్నగిరి సింధ్ స్థానంలో బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మహాయుతి కూటమిలో శివసేనకు ప్రాధాన్యత తగ్గుతోందని షిండే వర్గం నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ ప్రయోజనాలకు కాపాడేందుకు షిండే సామర్థ్యంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం?

ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలో దూసుకుపోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా న్యాయబద్దంగా సీట్ల పంపకం కుదరాలని లేదంటే ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత ఛగన్ భుజల్ నాసిన్ స్థానం నుంచి పోటీ చేయడానికి నిరాకరించారు. దీంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిపైనా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.



Next Story

Most Viewed