జార్ఖండ్‌లో ఉత్కంఠ: ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం

by samatah |
జార్ఖండ్‌లో ఉత్కంఠ: ఏర్పాటు కాని కొత్త ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతోంది. సీఎం సొరేన్ రాజీనామా అనంతరం తదుపరి సీఎం అభ్యర్థిగా చంపై సొరేన్ ను ఎన్నుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఇంకా ఆహ్వానించలేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లు అప్రమత్తమయ్యాయి. తమ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలించనున్నట్టు సమాచారం. అయితే శాసనసభా పక్ష నేత చంపై, ఐదుగురు ఎమ్మెల్యేలు రాంచీలోనే ఉండి, పరిస్థితులను గమనించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుపై జాప్యం చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘నితీశ్ కుమార్ రాజీనామా చేసిన ఐదు గంటల్లోపే తిరిగి ప్రమాణం చేశారు. జార్ఖండ్‌లో మెజారిటీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇది ఆందోళన కలిగించే అంశం. గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సీఎం ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. బీజేపీ శుక్రవారం శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారో బీజేపీ వర్గాలు వెల్లడించలేదు.

5.30కు గవర్నర్ అపాయింట్ మెంట్

జార్ఖండ్‌లో 18గంటలుగా కొత్త ప్రభుత్వం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను చంపై సొరేన్ కోరారు. అయితే 5.30గంటలకు చంపైకి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు సొరేన్‌ను ఈడీ అధికారులు గురువారం మధ్యాహ్నం పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు. సొరేన్‌ను ఈడీ 10రోజుల కస్టడీకి అప్పగించాలని కోరినట్టు సమాచారం.

Advertisement

Next Story