Supreme court: నిరసనకారులు నేరుగా మా వద్దకు రావొచ్చు.. రైతులకు సుప్రీంకోర్టు సూచన

by vinod kumar |
Supreme court: నిరసనకారులు నేరుగా మా వద్దకు రావొచ్చు.. రైతులకు సుప్రీంకోర్టు సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్(Panjab), హర్యానా (Haryana)ల మధ్య ఉన్న శంభు సరిహద్దులో రైతుల నిరసనకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు(Supreme court)లో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా పంజాబ్ ప్రభుత్వ ప్యానెల్‌తో చర్చలకు నిరాకరిస్తున్న రైతులకు అత్యున్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. రైతుల కోసం కోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వారు నేరుగా మా వద్దకు రావొచ్చని తెలిపింది. రైతుల ఉద్యమంపై దాఖలైన ఓ వ్యాజ్యంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖనౌరీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ (Jagjith singh dallewal) ఆరోగ్యంపై అప్ డేట్ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దల్లేవాల్‌పై నిర్లక్ష్యం వహించకూడదని, వెంటనే ఆయనకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది.

పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ (Gurmeender singh) వాదనలు వినిపించారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నాయకుడు దల్లేవాల్‌తో అనేక సమావేశాలు జరిపామని, కానీ రైతులు వాటిని తిరస్కరించారని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నియమించిన అత్యున్నత కమిటీ ఈ నెల 17న చర్చలు జరిపేందుకు రైతులను ఆహ్వానించిందని, కానీ రైతులు చర్చల్లో పాల్గొనలేదని పేర్కొన్నారు. రైతులను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అనంతరం స్పందించిన ధర్మాసనం అభ్యంతరాలు ఉంటే రైతులు నేరుగా తమ వద్దకు రావొచ్చని సూచించింది. ఈ అంశంపై గురువారం మరోసారి విచారణ జరగనుంది.

Advertisement

Next Story