'పురుషులకూ జాతీయ కమిషన్'.. పిటిషన్‌ విచారణకు సుప్రీం 'నో'

by Vinod kumar |
supreme court
X

న్యూఢిల్లీ : దేశంలో పురుషుల హక్కుల పరిరక్షణ కోసం "నేషనల్ కమిషన్ ఫర్ మెన్" ను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పెళ్లైన మగవాళ్లలో బలవన్మరణాలు అధికంగా ఉంటున్నాయని, గృహ హింసే దీనికి ప్రధాన కారణమంటూ న్యాయవాది మహేశ్‌ కుమార్‌ తివారీ వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడానికి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన బెంచ్ నిరాకరించింది. 'మీరు నాణేనికి ఒకవైపు ఉన్న అంశాలనే చూపించాలని అనుకుంటున్నారా..? పెళ్లైన వెంటనే ప్రాణాలు కోల్పోతున్న యువతల డేటాను ఇవ్వగలరా..? ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరు.. ఆయా కేసులకు సంబంధించిన స్థితిగతులపై ఇది ఆధారపడి ఉంటుంది' అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పెళ్లైన మగవాళ్లలో 33.2 శాతం మంది ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు కారణం కాగా, 4.8 శాతం మంది పురుషుల సూసైడ్ లకు వివాహ సంబంధిత వివాదాలే కారణమని పిటిషనర్ మహేశ్ కుమార్ తివారీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పురుషులు ఇచ్చే ఫిర్యాదులను కూడా నమోదు చేసుకునేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మార్గదర్శకాలను జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశాలపై అధ్యయనం నిర్వహించి నివేదికను అందించాలని లా కమిషన్‌ను ఆదేశించాలని, అది అందించే నివేదిక ఆధారంగా పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అయితే వీటిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Advertisement

Next Story

Most Viewed