'89 ఏళ్ల భర్త, 82 ఏళ్ల భార్య'.. విడాకుల కేసులో కీలక తీర్పు

by Vinod kumar |
89 ఏళ్ల భర్త, 82 ఏళ్ల భార్య.. విడాకుల కేసులో కీలక తీర్పు
X

న్యూఢిల్లీ : ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి.. వయసు 89 ఏళ్లు. 82 ఏళ్ల వయసున్న ఆమె గృహిణి. హర్యానాకు చెందిన ఈ వృద్ధ దంపతుల విడాకుల వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ‘‘భార్య వేధింపులను తట్టుకోలేకపోతున్నాను. ఆమె నుంచి విడాకులు ఇప్పించండి’’ అంటూ 89 ఏళ్ల భర్త పిటిషన్ వేశాడు. ‘‘నాకు విడాకులు వద్దు. జీవితాంతం ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నాను.

జీవిత చరమాంకంలో విడాకులు తీసుకున్న మహిళ అనే కళంకంతో చనిపోవాలని నేను కోరుకోవడం లేదు’’ అని కోర్టుకు 82 ఏళ్ల భార్య తెలిపింది. అయితే.. భార్య వేధింపులపై తగిన సాక్ష్యాలను చూపించడంలో భర్త విఫలమయ్యాడు. దీంతో బాధిత మహిళ ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీఎం త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించింది.

వైవాహిక జీవితం.. కోర్టుల్లో కేసులు..

ఛండీగఢ్‌కు చెందిన ఈ వృద్ధ దంపతులకు 60 ఏళ్ల క్రితం 1963లో పెళ్లయింది. 20 ఏళ్ల పాటు (1984 వరకు) వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. 1984 జనవరిలో ఉద్యోగం మద్రాసుకు బదిలీ అయిన తర్వాత ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో కొన్నేళ్ల తర్వాత విడాకుల కోసం ఛండీగఢ్ జిల్లా కోర్టును ఆశ్రయించగా, విడాకులు మంజూరయ్యాయి. ఈ తీర్పును పంజాబ్ హరియాణా హైకోర్టులో భార్య సవాల్ చేయడంతో.. జిల్లా కోర్టు ఆదేశాలను పక్కనబెట్టింది. చివరకు భర్త విడాకులు కావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.

‘‘గతంలో శిల్పా శైలేశ్ Vs వరుణ్ శ్రీనివాసన్ విడాకుల కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం మేం విడాకులను మంజూరుచేయలేం. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థను అత్యంత పవిత్రమైందిగానూ.. ఆధ్యాత్మిక కలయికగానూ చూస్తారు. అందుకే ఆర్టికల్ 142 కింద విడాకుల విషయంలో విచక్షణాధికారాన్ని ఆచితూచి వినియోగించాల్సిన అవసరం ఉంది’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Advertisement

Next Story