కోటాలో ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్థిని సూసైడ్

by samatah |
కోటాలో ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్థిని సూసైడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ హబ్‌గా పేరు పొందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడంలేదు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఉరుజ్ ఖాన్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. తాజాగా మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూపీలోని లక్నోకు చెందిన సౌమ్య(19) కోటాలో నివాసముంటూ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

రెండు రోజుల్లోనే రెండో ఘటన

సౌమ్య మృతితో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 8కి చేరుకోగా..రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. అంతకు ముందు మార్చి 25న యూపీకి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వరుసగా విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడుతుండటంతో ఆందోళన నెలకొంది. గతేడాది కూడా 29 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దీనిపై స్పందించిన కేంద్రం కోచింగ్ సెంటర్లకు పలు ఆదేశాలు జారీ చేసినా ఫలితాలు రావడం లేదు. అయితే ఇన్‌స్టిట్యూట్‌లు ప్రభుత్వ ఆర్డర్స్ పట్టించుకోవడం లేదని పలువురు భావిస్తున్నారు.

విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!

కోటాలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే ఒత్తిడితో పాటు కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా విద్యార్థులపై ఉంటుంది. దీని వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్న స్టూడెంట్స్ ఆత్మహత్యకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. విద్యార్థుల సూసైడ్‌లపై ఇటీవల జరిగిన పలు పరిశోధనల్లోనే ఇదే విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి విద్యార్థులపై మానసిక ఒత్తిడి లేకుండా చేయాలని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్, తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Advertisement

Next Story