స్పెక్ట్రమ్ వేలం.. నంబర్ 1 ఎయిర్ టెల్.. ‘జియో’ ప్లేస్ ఏదో తెలుసా ?

by Hajipasha |
స్పెక్ట్రమ్ వేలం.. నంబర్ 1 ఎయిర్ టెల్.. ‘జియో’ ప్లేస్ ఏదో తెలుసా ?
X

దిశ, బిజినెస్ బ్యూరో : రూ.96,238 కోట్లు విలువైన 10 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌‌కు సంబంధించిన వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నాయి. బుధవారం ఉదయం 11.30 గంటలకు వేలంపాట ముగిసే సమయానికి కేవలం 140-150 MHz స్పెక్ట్రంకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వానికి రూ.11వేల కోట్ల ఆదాయమే సమకూరనుంది. చివరిసారిగా 2022లో జరిగిన వేలం వారం రోజుల పాటు కొనసాగగా.. ఈసారి వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. ఈసారి 12 శాతం స్పెక్ట్రానికి మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి.

తొలిరోజు ఐదు రౌండ్ల బిడ్డింగ్‌లో రూ.11,340 కోట్లు విలువైన బిడ్లను టెలికాం కంపెనీలు సమర్పించాయి. భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా రూ.6,856 కోట్లు విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. వొడాఫోన్ ఐడియా రూ.3,510 కోట్లు విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ.. ఇటీవల ఆ కంపెనీ ఫాలో ఆన్ షేర్ల విక్రయాల ద్వారా నిధులను సమీకరించి స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు వెచ్చించింది. రిలయన్స్ జియో కేవలం రూ.973 కోట్లు విలువైన స్పెక్ట్రమ్ కొనుగోలుతో సరిపెట్టుకుంది. ఇక వేలంపాటలో రెండోరోజైన బుధవారం ఎలాంటి బిడ్లూ దాఖలు కాలేదు.

Next Story