మే 31 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాల రాక: వాతావరణ శాఖ

by S Gopi |
మే 31 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాల రాక: వాతావరణ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతీ రుతుపవనాలు మే 31 నాటికి కేరళకు వచ్చే అవకాశాలు ఉన్నాయని బుధవారం ప్రకటనలో వెల్లడిచింది. నాలుగు రోజులు ముందుగా లేదంటే ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. నైరుతిని ఆనుకుని పశ్చిమానికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో పశ్చిమ రాష్ట్రాలకు వేడిగాలులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే, కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఇక, ఈ వారం దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 25 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మే 24 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, మహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరవనంతపురంలో మంగళవారం రాత్రి నుంచే వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో సైతం ఇదే తరహాలో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉందని, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు ఐఎండీ పేర్కొంది. మరో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed