హిమాచల్ ప్రదేశ్‌లో మంచు బీభత్సం:168 రోడ్లు మూసివేత

by samatah |
హిమాచల్ ప్రదేశ్‌లో మంచు బీభత్సం:168 రోడ్లు మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచుకురుస్తుండటంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్ చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా.. దిగువ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది. మనాలీ సమీపంలోని రోహ్‌తంగ్‌ అటల్ టన్నెల్ వద్ద భారీ మంచు కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గత 24 గంటల్లో కల్ప, కుకుమ్‌సేరిలో 5 సెంటీమీటర్ల మంచు, కీలాంగ్‌లో 3 సెంటిమీటర్ల మంచు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర రాజధాని సిమ్లా, మరికొన్ని ప్రదేశాల్లో మెరుపులు, ఈదురు గాలులతో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మంచు ప్రభావంతో హిమాచల్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు కిన్నౌర్ జిల్లాలోని మాలింగ్ సమీపంలో బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story