Shigeru Ishiba: జపాన్ పీఎంగా మరోసారి షిగేరు ఇషిబా.. 103వ ప్రధానిగా ఎన్నిక

by vinod kumar |
Shigeru Ishiba: జపాన్ పీఎంగా మరోసారి షిగేరు ఇషిబా.. 103వ ప్రధానిగా ఎన్నిక
X

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్ ప్రధాన మంత్రిగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా (Shigeru ishiba) మరోసారి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ ఆయనను తదుపరి పీఎంగా ఎన్నుకుంది. సీఎంను ఎన్నుకోవడానికి ఆ దేశ పార్లమెంట్ సోమవారం సమావేశమైంది. అనంతరం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఎన్నికలు నిర్వహించగా.. ఇషిబాకు 221, జపాన్ డెమోక్రటిక్ పార్టీ అధినేత యోషిహికో నోడాకు 160 ఓట్లు వచ్చాయి. దీంతో ఇషిబా జపాన్ 103వ ప్రధానిగా ఎన్నికయ్యారు. గత నెలలో జపాన్‌లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఇషిబాకు చెందిన ఎల్‌డీపీ మెజారిటీ కోల్పోయింది. 465 స్థానాలకు గాను191 సీట్లు మాత్రమే వచ్చాయి. గత 15 ఏళ్లలో ఆ పార్టీ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఇషిబా పదవీ నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే విజయం సాధించారు. అయితే, 465 సీట్ల పార్లమెంటులో మెజారిటీకి 233 మంది అవసరం. పూర్తి మెజారిటీ లేకపోవడంతో, ఇషిబా ప్రభుత్వాన్ని నడపడంలో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా, పలు కుంభకోణాల్లో చిక్కుకోవడంతో ఫ్యూమియో కిషిడా జపాన్ ప్రధాని పదవి నుంచి వైదొలగగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇషిబా మొదటి సారి ప్రధానిగా ప్రమాణం చేశారు.

Advertisement

Next Story