Sharad Pawar: 'గడియారం' గుర్తుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన శరద్ పవార్

by S Gopi |
Sharad Pawar: గడియారం గుర్తుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చిహ్నమైన 'గడియారం' గుర్తును అజిత్ పవార్ వాడకుండా నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీకి గడియారం గుర్తుతో 25 సంవత్సరాల అనుబంధం ఉందని, ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడి హోదాలో తనకు గుర్తు పట్ల బంధం ఎక్కువని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఈ గుర్తును కొనసాగిస్తే ఓటర్లను తప్పుదారి పట్టించినట్టు అవుతుందని, ఎన్నికల నిష్పాక్షితానికి విఘాతం కలిగించినట్టు అవుతుందని వివరించారు. ఓటర్లలో అయోమయం కలగకుండా అజిత్ వర్గానికి కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకునేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును విన్నవించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఓటర్లు గందరగోళానికి గురయ్యారని, ముఖ్యంగా తక్కువ జనాభా ఉన్న నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, శరద్ పవార్ పిటిషన్‌ను అక్టోబర్ 15న సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించనుంది.

Next Story

Most Viewed