Sharad Pawar : ‘పవార్స్’ పాలిటిక్స్.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ పైచేయి

by Hajipasha |
Sharad Pawar : ‘పవార్స్’ పాలిటిక్స్.. శరద్ పవార్‌పై అజిత్ పవార్ పైచేయి
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘పవార్’ ఫ్యామిలీ మహారాష్ట్రలో పవర్ పాలిటిక్స్‌కు పెట్టింది పేరు. శరద్ పవార్(Sharad Pawar) కుటుంబం తొలిసారి రెండుగా చీలిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడింది. మేనల్లుడు అజిత్ పవార్(Ajit Pawar) సారథ్యంలోని ఎన్‌సీపీ మహాయుతి కూటమిలో ఉంది. శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ (ఎస్‌పీ) మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు చాలా స్థానాల్లో హోరాహోరీగా పోటీపడ్డారు. చివరకు మెజారిటీ అసెంబ్లీ సీట్లు మాత్రం అజిత్ వర్గం ఎన్‌సీపీ వర్గాన్నే వరించాయి. 59 స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ పార్టీ దాదాపు 40 సీట్లను హస్తగతం చేసుకోగా, 86 స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది. శరద్ పవార్ చరిష్మా ప్రభావం ఉన్న చాలా అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ ఎన్‌సీపీ తరఫు అభ్యర్థులు విజయఢంకా మోగించారు.

బారామతి స్థానం నుంచి పోటీ చేసిన అజిత్ పవార్ లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం 1.81 లక్షల ఓట్లను ఆయన సాధించారు. అజిత్ పవార్‌పై పోటీ చేసిన మేనల్లుడు యుగేంద్ర పవార్ (శరద్ పవార్ ఎన్‌సీపీ)కు 80వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఇదే బారామతి స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అందుకు విరుద్ధమైన ఫలితం రావడం గమనార్హం. గతంలో బారామతి స్థానం నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా దాదాపు 14 సార్లు గెలిచిన ట్రాక్ రికార్డు శరద్ పవార్‌కు ఉంది. తనకు రాజకీయ కంచుకోట లాంటి ఈ సీటును ఈసారి నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారు.

Advertisement

Next Story