Shafiqul Alam: యూనస్ ప్రభుత్వంలోనే హిందువులకు రక్షణ.. బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం

by vinod kumar |
Shafiqul Alam: యూనస్ ప్రభుత్వంలోనే హిందువులకు రక్షణ.. బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం
X

దిశ, నేషనల్ బ్యూరో: హేక్ హసీనా (Sheik haseena) హయాంలో కంటే ప్రస్తుత మహమ్మద్ యూనస్ (Mohammd yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ పాలనలోనే హిందువులు సురక్షితంగా ఉన్నారని బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం (Shafiqul Alam) అన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని భారత మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువులు అత్యంత సురక్షితంగా ఉన్నారు. షేక్ హసీనా పాలనలో ఉన్నదాని కంటే వారికి ఎక్కువ రక్షణ ఉంది. ఇటీవల వెలువడుతున్న కథనాలు భారత్ నుంచి వచ్చిన తప్పుడు ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. హిందూ సంబంధిత ప్రదేశాలన్నింటిలో భద్రతను పెంచామని తెలిపారు. జాతి, లింగం, రంగుతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్‌లో మానవ హక్కులను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

అవామీ లీగ్ (Avamee league) హయాంలో హిందువులపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని కానీ ఒక్క ఘటనకు సంబంధించిన నివేదికను కూడా మీడియా బయటపెట్టలేదని తెలిపారు. ఇస్కాన్‌ (ISKON)పై అణచివేత లేదని, ఇస్కాన్ దేవాలయాల వద్ద భద్రతా బలగాలను మోహరించామని చెప్పారు. కాగా, ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి, దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముగ్గురు హిందూ పూజారులను అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా భారీగా మైనారిటీలు వీధుల్లోకి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే షఫీకుల్ ఆలం వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story