Jammu Polls : జమ్మూ వైపు అందరి చూపు.. ఎన్నికల నగారా మోగడంతో హైఅలర్ట్

by Hajipasha |
Jammu Polls : జమ్మూ వైపు అందరి చూపు.. ఎన్నికల నగారా మోగడంతో హైఅలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో అందరి చూపు జమ్మూ ప్రాంతం వైపే ఉంది. ఎందుకంటే ఇటీవలే ఆ ప్రాంతంలో వరుస ఉగ్రదాడులు జరిగాయి. వాటిలో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఈనేపథ్యంలో జమ్మూలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. వీటికి అదనంగా అస్సాం రైఫిల్స్‌కు చెందిన రెండు బెటాలియన్లను రంగంలోకి దింపారు. గత కొన్ని నెలల వ్యవధిలో జమ్మూ రేంజ్‌లోని పీర్ పంజాల్ ఏరియాలో ఉన్న దట్టమైన అడవులు కేంద్రంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో ఆ ఏరియాపై భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.

2021 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జమ్మూ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఉగ్ర దాడుల్లో 52 మంది భారత భద్రతా దళాల సిబ్బంది అమరులయ్యారు. ప్రస్తుతం జమ్మూ ప్రాంతంలో వివిధ చోట్ల దాదాపు 50 మంది ఉగ్రవాదులు ఉన్నారని భారత నిఘావర్గాలు చెబుతున్నాయి. వారి వద్ద అమెరికన్ ఎం4 రైఫిల్స్, నైట్ విజన్ కళ్లద్దాలు, టెలిస్కోపిక్ లెన్సులు, ఎన్‌క్రిప్టెడ్ రేడియో సెట్స్ ఉన్నాయని అంటున్నాయి. ఈసమాచారం భారత భద్రతా బలగాల వద్ద ఇప్పటికే ఉండటంతో.. కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్లకు వెళ్లే క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా నిఘా డ్రోన్లను వాడుతున్నారు. వాటి ద్వారా అడవులు, కొండల ప్రాంతాలను జల్లెడపట్టి ఉగ్రమూకల ఆచూకీని గుర్తిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed