Kanwar Yatra: మూడు రాష్ట్రాల ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

by Shamantha N |
Kanwar Yatra: మూడు రాష్ట్రాల ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్వర్ యాత్ర(Kanwar Yatra) విషయంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కన్వర్ యాత్రపై నిబంధనలు విధిస్తూ మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కన్వర్ యాత్ర కొనసాగే మార్గంలో ఉన్న హోటళ్లు, డాబాలు, దుకాణాల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరఖండ్ (Uttarakhand), మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఇచ్చిన నిర్దేశాలపై కోర్టు స్టే విధించింది. అంతేగాక సమాధానం ఇవ్వాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు తుదపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు ఏమందంటే?

దీనికి సంబంధించి ఏవైనా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయా..? అని కోర్టు ప్రశ్నించింది. ఆహారపదార్థాలను అమ్ముకునే వ్యాపారులు నేమ్‌ ప్లేట్లపై పేర్లను వేయించాలని బలవంతపెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా.. తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారంట్‌కు వెళ్తాం. గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశమే ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. దీనిపై స్పందిస్తూ.. “ఆహార విక్రేతలు వారు అందించే ఆహారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, కానీ వారు యజమానులు, సిబ్బంది సహా ఇతర వివరాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు” అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.


Advertisement

Next Story