Samudra Pratap: దేశంలోనే మొదటి కాలుష్య నియంత్రణ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభం

by vinod kumar |
Samudra Pratap: దేశంలోనే మొదటి కాలుష్య నియంత్రణ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశపు మొట్ట మొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్‌ను గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) గురువారం ప్రారంభించింది. రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేత్ సమక్షంలో దీనిని లాంచ్ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాలను తీర్చడానికి జీఎస్ఎల్ ద్వారా ఈ నౌకను రూపొందించారు. దీని పొడవు 114.5మీటర్లు, వెడల్పు 16.5మీటర్లు ఉంటుంది. 4170 టన్నుల వరకు స్థానభ్రంశం చెందుతుంది. ఇందులో14 మంది అధికారులు, 115 మంది నావికులు ఉండనున్నారు. 2022 నవంబరు 21న ఈ ఓడకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి, గోవా షిప్‌యార్డ్ ఈ ప్రయోగ మైలురాయిని సాధించడంలో పురోగతి సాధించింది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రూ.583 కోట్ల వ్యయంతో రెండు కాలుష్య నియంత్రణ నౌకలను నిర్మించడానికి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నౌకలను స్వదేశీ పద్ధతిలో నిర్మించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సంజయ్ సేత్ మాట్లాడుతూ..రక్షణ ఉత్పత్తిలో దేశం పూర్తిగా ఆత్మనిర్భర్ మాత్రమే కాకుండా నికర ఎగుమతిదారుగా కూడా మారేందుకు పరిశ్రమ భాగస్వాములు కృషి చేయాలని కోరారు. ప్రధాని మోడీ దార్శనికతతో దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. రక్షణ అవసరాల కోసం నౌకల నిర్మాణంలో దేశం ఆత్మనిర్భర్‌గా మారిందని, దేశీయంగా నౌకలను నిర్మించడం హర్షనీయమని తెలిపారు.

Advertisement

Next Story