దేశంలో పెరుగుతున్న ఊబకాయం

by S Gopi |
దేశంలో పెరుగుతున్న ఊబకాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒకప్పుడు అమెరికాలోనో మరే ఇతర దేశాల ప్రజలో అతిగా తిని ఊబకాయం తెచ్చుకుంటారని వినేవాళ్లం. అయితే, ఇది ఇప్పుడు భారత్‌లోనూ ఎక్కువగా వినిపించనుంది. దేశంలోని చాలామందిలో ఊబకాయం పెరుగుతోందని తాజాగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్‌హెచ్ఎస్) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సర్వే నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 2019 నుంచి 2021 మధ్య నిర్వహించిన ఈ సర్వేలోని గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి 10 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అధిక చక్కెర, కొవ్వు ఉన్న ప్రాసెస్‌డ్ ఫుడ్ ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు సోషల్ మీడియా వినియోగం, డివైజ్‌ల స్క్రీన్ టైమ్ పెరగడం కూడా చాలామందిలో ఊబకాయానికి గురవుతున్నారు. దేశంలోని మొత్తం కేసుల్లో 56.4 శాతం మంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నారని సర్వే పేర్కొంది. సగటున దేశంలో 22.9 శాతం మంది పురుషులు, 24 శాతం మంది మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ గతంలో కంటే 4 శాతం ఊబకాయం పెరిగింది. సర్వే చేసిన సమయంలో కరోనా మహమ్మారి, ఎక్కువ కాలం లాక్‌డౌన్ వల్ల ప్రజల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం ఒబెసిటీకి కారణమని ఎన్ఎఫ్‌హెచ్ఎస్ అభిప్రాయపడింది.

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువ మంది ఊబాకయంతో బాధపడుతున్నారని ఎన్ఎఫ్‌హెచ్ఎస్ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 29.8 శాతం, గ్రామీణంలో 19.3 శాతంగా ఉంది. ఊబకాయం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని 41.3 శాతం మహిళలు, 38 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. ఆ తర్వాత తమిళనాడులోని 40.4 శాతం మహిళలు, 37 శాతం మహిళలు ఒబేసిటీని ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలో ఆంధ్రప్రదేశ్‌లోని 36.3 శాతం మహిళలు, 31.1 శాతం పురుషులు, తెలంగాణలో 32.1 శాతం పురుషులు, 30.1 శాతం మహిళలు ఊబకాయం కలిగి ఉన్నారు.

Advertisement

Next Story