Mobile App Scam : ‘హైబాక్స్ మొబైల్ యాప్’ పేరుతో రూ.500 కోట్ల స్కాం.. ఎలా జరిగిందంటే..?

by Hajipasha |
Mobile App Scam : ‘హైబాక్స్ మొబైల్ యాప్’ పేరుతో రూ.500 కోట్ల స్కాం.. ఎలా జరిగిందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘హైబాక్స్ మొబైల్ యాప్’ పేరుతో రూ.500 కోట్ల భారీ స్కాం జరిగింది. ఈ యాప్‌ ద్వారా పెట్టుబడి పెట్టే మొత్తంపై రోజుకు 1 నుంచి 5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తామంటూ బుకాయించారు. ప్రతినెలా సగటున 30 నుంచి 90 శాతం దాకా వడ్డీ ఆదాయాన్ని అందిస్తామని నమ్మించారు. 2024 ఫిబ్రవరిలో మొదలైన ‘హైబాక్స్ మొబైల్ యాప్’ కొన్ని నెలల్లోనే 30వేల మందికిపై ప్రజల నుంచి కోట్లాది రూపాయల పెట్టుబడులను రాబట్టింది. ఈ ఏడాది జూన్ వరకు ఇన్వెస్టర్లకు ప్రతినెలా సరిగ్గానే వడ్డీ ఆదాయాలను ‘హైబాక్స్ మొబైల్ యాప్’ చెల్లించింది. అయితే ఆ తర్వాతి నుంచే అసలు కథ మొదలైంది. చాలా మంది ఇన్వెస్టర్లకు వడ్డీ ఆదాయాల చెల్లింపులు ఆగిపోయాయి. కొందరికే పేమెంట్స్ చేయసాగారు. దీనిపై ఆరాతీసే కస్టమర్లకు సాంకేతిక సమస్యలు, జీఎస్టీ సమస్యలు, లీగల్ చిక్కులు ఉన్నాయని బుకాయించారు.

దీంతో విసిగి వేసారిన 500 మందికిపైగా బాధితులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈవివరాలను శనివారం ఉదయం ఢిల్లీ డీసీపీ (ఐఎఫ్ఎస్‌ఓ) హేమంత్ తివారీ మీడియాకు వెల్లడించారు. నటి రియా చక్రవర్తి, కమేడియన్ భారతీ సింగ్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ వంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో ‘హైబాక్స్ మొబైల్ యాప్’‌పై ప్రచారం చేశారు. దీంతో అది మంచి కంపెనీయే అని భావించి చాలామంది పెట్టుబడులు పెట్టారు. చెన్నైకు చెందిన శివరామ్ (30) అనే వ్యక్తి ఈ యాప్‌ను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడిని ఇప్పటికే అరెస్టు చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను సైతం పోలీసులు విచారించారు. ‘హైబాక్స్ మొబైల్ యాప్’‌‌లో పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా వినియోగించిన ఫోన్ పే, ఈజ్ బజ్‌ల పాత్రపైనా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed