President Droupadi Murmu : మహిళలపై గౌరవాన్ని మాటల్లో కాదు.. ఆచరణలో చూపించండి : రాష్ట్రపతి

by Hajipasha |
President Droupadi Murmu : మహిళలపై గౌరవాన్ని మాటల్లో కాదు.. ఆచరణలో చూపించండి : రాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో : మహిళలపై గౌరవం అనేది మాటలకే పరిమితం కావొద్దని.. దాన్ని నిష్ఠతో ఆచరించి చూపించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మహిళలను గౌరవించేలా పిల్లలకు నైతిక విలువలను బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉందని ఆమె చెప్పారు. ఏ సమాజంలోనైనా మహిళల స్థితిగతులే అభివృద్ధికి కీలక కొలమానంగా నిలుస్తాయన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ముర్ము ప్రసంగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది ఉపాధ్యాయులకు నేషనల్ టీచర్స్ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన వారందరినీ ప్రశంసా పత్రం, రూ.50వేల నగదు బహుమతి, సిల్వర్ మెడల్‌‌‌తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎదగడం అనేది విజయమే. కానీ ఇతరుల మేలుకు పాటుపడటంలోనే నిజమైన జీవిత పరమార్ధం దాగి ఉంది. మనం ఇతరుల పట్ల దయతో మెలగాలి. నైతికంగా ప్రవర్తించాలి. అర్థవంతమైన జీవితంలోనే విజయవంతమైన జీవితం దాగి ఉంటుంది. పిల్లలకు ఇలాంటి విలువలను ఉపాధ్యాయులు బోధించాలి’’ అని కోరారు. ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యావ్యవస్థ విజయవంతం అవుతుందని ముర్ము చెప్పారు. ‘‘ఉపాధ్యాయ వృత్తి అంటే ఉద్యోగం కాదు. మానవ వికాసాన్ని పరిపూర్ణం చేసే పవిత్ర కార్యాన్ని చేయగలిగేది ఉపాధ్యాయులే. వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థులను చదువుతో పాటు వారిలో సహజసిద్ధంగా ఉన్న అత్యుత్తమ నైపుణ్యాల్లో(నాయకత్వ పటిమ, క్రీడలు వంటివి) ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు.

Advertisement

Next Story