మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో డైనోసార్.. ధార్ జిల్లాలో గుడ్డు ల‌భ్యం!

by Sumithra |
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో డైనోసార్.. ధార్ జిల్లాలో గుడ్డు ల‌భ్యం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌నిషి ఉద్భ‌వించ‌క‌ముందే భూమిని ఏలిన‌ డైనోసార్‌ల గురించి మ‌నిషికి చాలా ఆస‌క్తి. హాలివుడ్‌లో డైనోసార్ సినిమాల‌కు ఉన్న క్రేజ్‌ను చూస్తే ఇది ఎవ్వ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ఇక‌, అంత‌ర్జాతీయంగా కొన‌సాగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో డైనోసార్ల‌పై ఇప్ప‌టికే ఎన్నో అధ్య‌య‌నాలు, ఆవిష్క‌ర‌ణ‌లు బ‌య‌ట‌కొచ్చాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో కూడా డైనోసార్ అవ‌శేషాలు క‌నుగొన్నారు. ఈ ప్రత్యేకమైన శిలాజ డైనోసార్ గుడ్డు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ గుడ్ల గుంపును ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కనుగొంది. ఇందులో ప్ర‌త్యేక‌త ఏంటంటే ఒక గుడ్డు లోపల మరొక గుడ్డు గూడు కట్టుకొని ఉండ‌టం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని డైనోసార్ శిలాజ జాతీయ ఉద్యానవనంలో ఈ విష‌యం కనుగొన్నారు. ఈ గుడ్లు టైటానోసార్‌లకు చెందినవని, ఇది సౌరోపాడ్ డైనోసార్‌ల విభిన్న సమూహం అని ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తున్నారు. ఈ ఆవిష్కరణ నేచర్ గ్రూప్ జర్నల్ అయిన సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో "ఫస్ట్ ఓవమ్-ఇన్-ఓవో పాథలాజికల్ టైటానోసౌరిడ్ ఎగ్ థ్రోస్ లైట్ ఆన్ ది రిప్రొడ‌క్టీవ్ బ‌యోల‌జీ ఆఫ్ సౌరోపాడ్ డైనోసార్స్‌" అనే శీర్షికతో ప్రచురించారు. డైనోసార్ గుడ్డులో గుడ్డు ఉండే అరుదైన విష‌యాన్ని శాస్త్రవేత్తలు చూడటం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం కాగా, ఇది పక్షుల్లో మాత్రమే కనిపిస్తుంది కానీ సరీసృపాల్లో ఎప్పుడూ క‌నిపించ‌లేద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

మధ్య భారతదేశంలోని ఎగువ క్రెటేషియస్ లామెటా నిర్మాణం డైనోసార్ శిలాజాలకు చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది. శాస్త్రవేత్తల బృందం నేషనల్ పార్క్ సమీపంలో టైటానోసౌరిస్ సౌరోపాడ్‌కు చెందిన‌ 52 గూళ్ళను కనుగొన్నారు. అందులో ఒక గూడులో 10 గుడ్లు ఉన్నాయి. వాటిలో "అసాధారణ లేదా రోగలక్షణ" గుడ్డు కనుగొన్న‌ట్లు ప‌రిశోధ‌క‌లు పేర్కొన్నారు. "గుడ్డు పెంకుల్లో ప్రతిబింబించే అసాధారణ ల‌క్ష‌ణాల్లో.. ఒకదానికొకటి సన్నిహితంగా ఉండే బహుళ ఎగ్‌షెల్ యూనిట్లు, అలాగే ఒకదానిపై ఒకటి (మల్టీ-షెల్డ్), అసాధారణంగా క‌నిపించే మందపాటి లేదా సన్నని గుడ్డు పెంకులు, అసాధారణ ఆకారంలో ఉండే షెల్ యూనిట్లు, రంధ్రాల వ‌రుస‌లను నిరోధించే అదనపు షెల్ యూనిట్లు, ఉపరితల లోపాలు ఉన్నాయి" అని పరిశోధన పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed