SC: తీర్పు ఇవ్వడంలో ఘోర తప్పిదం చేసింది.. మద్రాస్ హైకోర్టుపై సుప్రీం వ్యాఖ్యలు

by Shamantha N |
SC: తీర్పు ఇవ్వడంలో ఘోర తప్పిదం చేసింది.. మద్రాస్ హైకోర్టుపై సుప్రీం వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ (Child Pornography) చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని వెల్లడించింది. తీర్పు ఇవ్వడంలో హైకోర్టు ఘోర తప్పిదం చేసిందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలానే, కేంద్రానికి పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ (Child Pornography)’ అనే పదంపై నిషేధం విధించింది. ‘ఛైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేటివ్‌ అండ్‌ అబ్యూసివ్‌ మెటీరియల్‌’(CSEAM) అనే పదంతో మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని పార్లమెంట్‌కు తెలిపింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు దీనిపై ఆర్డినెన్స్‌ జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఇకపై కోర్టులు ‘ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ’ పదాన్ని వాడొద్దని ఆదేశించింది.

మద్రాస్ హైకోర్టు ఏమందంటే?

ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసులో 28 ఏళ్ల యువకుడిపై క్రిమినల్‌ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు (Madras High Court) ఆదేశాలిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వీడియోలు చూడటం తప్ప.. ఎలాంటి నేరానికి పాల్పడలేదని తెలిపింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గంలో నడిపేలా దృష్టి పెట్టాలని సూచించింది. కాగా.. ఈ తీర్పుపై పలు ఎన్జీవోలు, పిల్లల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. ఆ యువకడిపై క్రిమినల్‌ చర్యలను తిరిగి ప్రారంభించాలని సూచించింది.

Next Story

Most Viewed