Religious Conversion : రిజర్వేషన్ కోసం మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే : సుప్రీంకోర్టు

by Hajipasha |
Religious Conversion : రిజర్వేషన్ కోసం మతం మారడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే : సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల కోసం మతాన్ని మార్చుకోవడం(Religious Conversion) అనేది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యానించింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న ఓ మహిళకు ఎస్‌సీ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరిలో హిందూ తండ్రికి, క్రైస్తవ తల్లికి పుట్టిన సి.సెల్వరాణి క్రైస్తవ మతాన్నే అనుసరిస్తోంది. అయితే ఆమె 2015లో అప్పర్​ డివిజన్ కర్ల్క్ పోస్ట్​కు అప్లై చేసుకుంది. ఈ ఉద్యోగంలో రిజర్వేషన్ ప్రయోజనాలను వాడుకునేందుకు సి.సెల్వరాణి కీలక నిర్ణయం తీసుకుంది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని ప్రకటించింది. ఆర్య సమాజం ద్వారా హిందూ మతంలోకి మారానని, తనకు ఎస్‌సీ సర్టిఫికెట్ మంజూరు చేయాలంటూ అప్పట్లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించిన హైకోర్టు.. ఆమెకు ఎస్‌సీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది.

రిజర్వేషన్ విధానాల స్ఫూర్తికి విఘాతం

సి.సెల్వరాణి దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెలువడింది. సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నందున ఎస్‌సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు అనుమతించదని న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. రిజర్వేషన్ కోసం మతం మారితే .. రిజర్వేషన్ కోటా విధానానికి సంబంధించిన ప్రాథమిక, సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్లే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. దీనివల్ల బలహీన వర్గాలను ఉద్దేశించిన రిజర్వేషన్ విధానాల స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని కామెంట్ చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడటం అంటే రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed