రష్యన్ సైన్యం నుంచి భారతీయుల రిలీజ్: వెల్లడించిన విదేశాంగ శాఖ

by samatah |
రష్యన్ సైన్యం నుంచి భారతీయుల రిలీజ్: వెల్లడించిన విదేశాంగ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న పలువురు భారతీయులను భారత్ అభ్యర్థన మేరకు రష్యా విడుదల చేసింది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. రష్యన్ సైన్యంలో ఉన్న భారతీయులకు సంబంధించిన అన్ని కేసులను పరిష్కరించడానికి రష్యా అంగీకరించినట్టు తెలిపింది. ‘రష్యన్ సైన్యంతో ఉన్న భారతీయులు సహాయం కోరుతున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలు సరికాదు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని విచారణ చేపట్టాం. వీటిని రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీని ఫలితంగా ఇప్పటికే కొంత మంది భారతీయులు విడుదలయ్యారు’ అని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

భారత పౌరులు రష్యన్ సైన్యంలో సహాయక ఉద్యోగాలు పొందారని పలు కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ దళాలతో కలిసి భారతీయ పౌరులు పోరాడుతున్నాయని తెలిపాయి. దీనిపై స్పందించిన విదేశాంగశాఖ రష్యా-ఉక్రెయిన్ వివాదంలో చిక్కుకోకుండా ఉండాలని గతవారం భారత పౌరులకు సూచించింది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకున్న భారతీయులను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే రష్యా ఆర్మీలో ఎంత మంది భారతీయులు పనిచేస్తున్నారు, ఎంత మంది డిశ్చార్జ్ అయ్యారు అనే విషయాలను వెల్లడించలేదు. రష్యా సైన్యంలో సుమారు 100 మంది ఇండియన్స్ ఉండొచ్చని పలు నివేదికలు తెలిపాయి. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈనెల 24న మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story