Ranya Rao: దుబాయి మాత్రమే కాదు.. యూరప్, సౌదీ,అమెరికా నుంచి గోల్డ్ స్మగ్లింగ్

by Shamantha N |
Ranya Rao: దుబాయి మాత్రమే కాదు.. యూరప్, సౌదీ,అమెరికా నుంచి గోల్డ్ స్మగ్లింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: గోల్డ్ స్మగ్లింగ్(gold smuggling) చేస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు(Ranya Rao) కేసులో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. యూఏఈ నుంచి నటి రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయికి మాత్రమే కాకుండా యూరప్‌, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు తాను వెళ్లినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)కి ఆమె తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి తాను వెల్లడించిన విషయాలను రహస్యంగా ఉంచాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తాను బాగా అలసిపోయానని.. కొంత సమయం విశ్రాంతి ఇప్పించాలని విచారణ సమయంలో రన్యా రావు అధికారులను అభ్యర్థించారని తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రన్యారావు.. ఈ కేసులో దర్యాప్తునకు సహకరిస్తానని విచారణ అధికారులతో చెప్పుకొచ్చారు. రన్యా రావు గతేడాది 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని.. కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు.. ప్రతి ట్రిప్‌లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రతి ట్రిప్‌కు దాదాపు రూ.12-13లక్షలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు.

దుబాయి నుంచి గోల్డ్ స్మగ్లింగ్

ఇటీవలే దుబాయ్‌ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన రన్యారావును ఎయిర్ పోర్టులో అధికారులు అరెస్టు చేశారు. తరచూ దుబాయ్‌కు వెళ్లడం.. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు వెనక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. నటి రన్యా రావు భర్త జతిన్‌ హుక్కేరి ఆమెతో కలిసి పలుమార్లు దుబాయ్‌ వెళ్లడంతో.. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, బెంగళూరు లావెల్లే రోడ్డులోని (Lavelle Road) ఆమె నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో మరో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఆమె వద్ద నుంచి రూ.17.29 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారం అక్రమ రవాణా కేసుల్లో (gold smuggling) ఇది ఒకటి అని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed