అమేఠీ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

by S Gopi |
అమేఠీ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ మరింత వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే అత్యంత చర్చనీయాంసంగా మారిన నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది. అలాంటి వాటిలో యూపీలోని అమేఠీ అత్యంత ప్రముఖమైనది. ఇప్పటికే ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనో, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కంచుకోట అమేఠీ లోక్‌సభ అభ్యర్థి ప్రకటనపై పార్టీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. చాలారోజుల నుంచి అభ్యర్థి ప్రకటన కోసం ఎదురుచూసిన కాంగ్రెస్ కార్యకర్తలు నియోజకవర్గంలో నిరసనకు దిగారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం ఎదుట అభ్యర్థి ఎవరో ప్రకటించాలని ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఐదో దశ పోలింగ్‌లో భాగంగా మే 20న రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్‌ దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అమేఠీ నుంచి మూడుసార్లు ఎంపిగా ఎన్నికైన రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లోనూ ఆమె విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. కాంగ్రెస్ మాత్రం ఈ స్థానంలో పోటీ అభ్యర్థిపై ఆలస్యం చేస్తోంది. పార్టీ నిర్ణయం వచ్చేస్తోందనే సంకేతాల మధ్య సహనం కోల్పోయిన కార్యకర్తలు అభ్యర్థిని ప్రకటించాలని చేపట్టడం గమనార్హం. కేరళలో ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందని అంతా ఆశించారు. కానీ గత నాలుగు రోజులుగా ఈ విషయంలో పురోగతి లేదు. మరో రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed