సరిహద్దుల్లో సైన్యం వల్లే దేశం భద్రంగా ఉంది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by karthikeya |
సరిహద్దుల్లో సైన్యం వల్లే దేశం భద్రంగా ఉంది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ దశమిని పురస్కరించుకొని నేడు (శనివారం) పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో గల సుక్నా కాంట్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ చేసిన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమి జరుపుకుంటామని, అలాంటి పర్వదినాన దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పహారా కాసే సన్యంతో గడపడం ఆనందంగా ఉందన్నారు.

భారత దేశ సరిహద్దులో సైన్యం అప్రమత్తంగా ఉండడం వల్లే ఎలాంటి ఉద్రిక్తతలు సంభవించడం లేదని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగు దేశాలు భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగే ప్రమాదముందని, అందువల్ల సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత్ ఏ దేశంపైనా సొంతంగా దాడి చేయదని, ఎవరితోనూ భారత్‌కు శత్రుత్వం లేదని, కానీ ఏ దేశమైనా భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే వారితో పోరాడక తప్పదని రక్షణ మంత్రి అన్నారు.

ప్రపంచ దేశాల్లో నెలకొన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఓ (బోర్డర్ రోడ్స్ ఆర్గనేజైషన్)కు సంబంధించి దేశ వ్యాప్తంగా 75 భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ‘వికసిత్ భారత్ 2047’ దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story